ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఉండాల్సిన అర్హతలు

Qualifications for Member Of  Legislative Assembly - Sakshi

మార్గదర్శకాలను విడుదల చేసిన ఎన్నికల సంఘం  

సుజాతనగర్‌: ముందస్తు ఎన్నికల హడావిడితో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీంతో  ప్రధాన పార్టీలతో పాటు, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు పలువురు అభ్యర్థులు ఉత్సాహం చూపుతున్నారు. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలపై కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విడుదల చేసింది. పోటీ చేసే అభ్యర్థి కచ్చితంగా కింది అర్హతలను కలిగి ఉండాలి. 

  • 25 ఏళ్ల వయసు ఉండాలి.
  • నామినేషన్‌ సమయంలో భారత పౌరుడినని, రాజ్యాంగానికి, భారత సార్వభౌమాధికారానికి లోబడి నడుచుకుంటానని ప్రమాణ పత్రం సమర్పించాలి.
  • రాష్ట్రంలో ఎక్కడైనా ఓటు హక్కు తప్పనిసరిగా ఉండాలి. 
  • సొంత నియోజకవర్గం నుంచి కాకుండా మరోచోట పోటీచేసే అభ్యర్థి తనకు ఓటుహక్కు ఉన్నట్లు ధ్రువీకరించే పత్రాన్ని నామినేషన్‌ ఫారంతో జతచేయాలి.
  • అభ్యర్థులను ప్రతిపాదించేవారు కచ్చితంగా అదే నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.
  • ఫారం–2 బీలో నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయాలి. 
  • ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్‌ దాఖలుకు ముందు విధిగా ఏదైనా బ్యాంకు ఖాతా ప్రారంభించాలి. బ్యాంకు ఖాతా పుస్తకాన్ని నామినేషన్‌ సమయంలో రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాలి. 
  • రూ.10 వేలు డిపాజిట్‌ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులయితే రూ.5 వేలు చెల్లిస్తే సరిపోతుంది. జనరల్‌ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులకు సైతం ఈ నిబంధన వర్తిస్తుంది. కులధ్రువీకరణ పత్రాన్ని నామినేషన్‌ సమయంలో సమర్పించాలి. 
  • స్వతంత్ర అభ్యర్థిని 10 మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. 
  • నామినేషన్‌ సమయంలో నోటరీ చేసిన అఫిడవిట్‌ సమర్పించాలి. ఇందులో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు సమగ్రంగా చూపించాల్సి ఉంటుంది. 
  • అఫిడవిట్‌లోని అన్ని కాలమ్స్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్క కాలమ్‌ను వదిలేసినా నోటీసు జారీ చేస్తారు. అప్పటికీ స్పందించకపోతే నామినేషన్‌ను తిరస్కరిస్తారు.  
  • ఒక వ్యక్తి నాలుగు సెట్ల నామినేషన్‌ను దాఖలు చేయవచ్చు. డిపాజిట్‌ మాత్రం ఒకసారి చెల్లిస్తే సరిపోతుంది. నామినేషన్‌ దాఖలు గడువు ముగిసేలోపు నాలుగు సెట్ల నామినేషన్‌ను ఏ రోజైనా దాఖలు చేయవచ్చు. 
  • ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు రూ.28 లక్షల వరకు మాత్రమే ఎన్నికల కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఎన్నికల ఖర్చు మొత్తాన్ని ప్రత్యేకంగా ప్రారంభించిన ఖాతా ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. 
  • నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో అభ్యర్థితో పాటు, ఐదుగురిని మాత్రమే రిటర్నింగ్‌ అధికారి చాంబర్‌లోకి అనుమతిస్తారు. 
  • పోటీచేసే అభ్యర్థుల ప్రచార వాహనానికి సంబంధించి అనుమతి తప్పకుండా పొందాలి. 
  • ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులు. ముందుగా ఉద్యోగానికి రాజీనామా చేయడంతో పాటు, ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన వారు మాత్రమే నామినేషన్‌ వేసేందుకు అర్హులు.
Read latest Assembly News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top