టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి

YV Subba Reddy as the Chairman of TTD - Sakshi

ఉత్తర్వులు జారీ

నేడు ప్రమాణ స్వీకారం

సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి అధ్యక్షునిగా వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం ఆయన చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌ హిందూ దేవదాయ, ధర్మాదాయ చట్టం, 1987ను అనుసరించి ఈ నియామకం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్‌మోహన్‌సింగ్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బోర్డులో ఇతర సభ్యుల నియామకాన్ని త్వరలోనే చేపడతామని తెలిపారు. ప్రకాశం జిల్లా మేదరమెట్ల గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి స్వయానా తోడల్లుడు.

వైఎస్‌ మరణం తరువాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో స్థాపించిన వైఎస్సార్‌సీపీలో వైవీ దశాబ్ద కాలంగా క్రియాశీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2014లో ఆయన ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. రాష్ట్ర విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్‌సభలోనూ,వెలుపల పోరాడారు. హోదా కోసం సహచర ఎంపీలతోపాటు ఆయన తన పదవిని త్యాగం చేశారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయక పోయినా పార్టీ గెలుపు కోసం గట్టి కృషి చేశారు. ప్రస్తుతం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. కాగా,  తనను టీటీడీ చైర్మన్‌గా నియమించినందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైవీ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఆయన తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత తిరుమలకు బయలుదేరిన సుబ్బారెడ్డి మార్గ మధ్యలో తిరుపతి పద్మావతిపురంలో ఉంటున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. అతంతరం వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారి మెట్ల మార్గం మీదుగా తిరుమల వెళ్లారు. 

పాత పాలక మండలి రద్దు
టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ సహా పలువురు సభ్యుల రాజీనామాల అనంతరం ముగ్గురు సభ్యులతో మిగిలిన దేవస్థానం పాలక మండలిని పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం తొలుత నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్‌మోహన్‌సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ పాలకమండలి సమావేశం కావాలంటే కనీసం ఐదుగురు సభ్యుల కోరం అవసరమని, పలువురు సభ్యుల రాజీనామాల అనంతరం ఎక్స్‌ అఫీషియో సభ్యులతో కలిసి ముగ్గురు సభ్యులే మిగలడం వల్ల ఈ పాలకమండలి కొత్తగా ఎలాంటి నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉండదని టీటీడీ ఈవో ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరడంతో పూర్తి స్థాయిలో కొత్త పాలక మండలి ఏర్పాటుకు వీలుగా పాత పాలక మండలిని పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top