
బుక్కరాయసముద్రం : డ్వాక్రా సంఘాల మహిళలకు పుసుపు– కుంకుమ కింద రూ.10వేలు, సెల్‌ఫోన్ అందిస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించడం మరోమోసమని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి విమర్శించారు. శనివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు వస్తుండడంతో డ్వాక్రా సంఘాల ఓట్లకోసం చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారన్నారు. గత ఎన్నికల్లోను డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీనని హామీ ఇచ్చి, గెలిచిన తర్వాత మాఫీ చేయకుండా మోసం చేశారన్నారు. ప్రతి ఒక్కరికీ చేతికీ మూడు విడతల్లో రూ.10 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారని, కానీ ఏఒక్కరికీ చేతికిరాదన్నారు. చెక్కుల రూపంలో ఇస్తామన్నారని, దీని వల్ల ఏ ఒక్క రూపాయి మాఫీకాదన్నారు.
అణా పైసాతో సహా మాఫీ అన్నారు..మరిచిపోయారు
2014 మార్ఛి 31 నాటికి డ్వాక్రా రుణా లను అణా పైసాతో సహా మాఫీ చేస్తానని చెప్పారని, బ్యాంకుల్లో తాకట్టు పెట్టి న బంగారు రుణాలను కూడా మాఫీ చేస్తామని చెప్పారని అన్నారు. అయితే ఏవీ మాఫీ చేయకపోవడంతో డ్వాక్రా మహిళలు అవస్థలు పడి బ్యాంకులకు రుణం చెల్లించుకోవాల్సి వస్తోందన్నారు. వైఎస్ జగనన్న అధికారంలోకొస్తేనే డ్వాక్రా రుణాలు ఎన్నికల రోజు వరకూ ఉన్న మొత్తం నాలుగు దఫాలుగా మహిళల చేతికే అందిస్తారన్నారు. అంతేకాకుండా వడ్డీలేని రుణాలు మంజూరు చేయించి, ఆ వడ్డీ మొత్తాన్ని మహిళ తరఫున బ్యాంకులకు చెల్లించనున్నట్లు తెలి పారు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.75 వేలు నాలు గేళ్లులో దశల వారీగా అందించనున్నట్లు తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లలను బడికి పంపితే ఏడాదికి రూ.15 వేలు అందించనున్నట్లు తెలిపారు.