కేంద్ర మంత్రి మండలిలో టీనోట్ ఆమోదానికి నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన 72 గంటల బంద్ విజయవంతమైంది. జిల్లాలో మూడో రోజు ఆదివారం వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాయి
కర్నూలు, న్యూస్‌లైన్:
కేంద్ర మంత్రి మండలిలో టీనోట్ ఆమోదానికి నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన 72 గంటల బంద్ విజయవంతమైంది. జిల్లాలో మూడో రోజు ఆదివారం వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాయి. బ్యాంకులు, ఏటీఎం సెంటర్లు, పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఇదిలా ఉండగా అడ్డగోలు విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాటి నుంచి మొదలు పెట్టిన రిలే నిరాహార దీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ దీక్షల్లో పాల్గొన్నారు. బంద్‌లో భాగంగా లారీలు, ఆటోలు చివరకు ద్విచక్ర వాహనాలు సైతం ఉద్యమకారులు అడ్డుకోవడంతో రవాణా పూర్తిగా స్తంభించింది. వైఎస్సార్సీపీ శ్రేణులకు తోడుగా సమైక్యవాదులు కూడా ఆందోళనల్లో పాల్గొనడంతో సకలం మూతపడ్డాయి.
అత్యవసర సర్వీసులు మినహా జిల్లా అంతటా అన్ని వర్గాల ప్రజలు బంద్‌కు సహకరించారు. ఉదయం 8 గంటల నుంచే పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి దుకాణాలను మూయించారు. అడపాదడపా తిరుగుతున్న ఆటోలను కూడా గాలి తీసి అడ్డుకున్నారు. కర్నూలులో నియోజకవర్గం సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి పర్యవేక్షణలో పార్టీ శ్రేణులు నగరమంతా పర్యటించి దుకాణాలను బంద్ చేయించారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పాణ్యంలో నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో ఉల్చాల రోడ్డు నుంచి బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ సర్కిల్ మీదుగా నంద్యాల చెక్‌పోస్టు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. గౌరీశంకర్ కాంప్లెక్స్ దగ్గర యథావిధిగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదోనిలో నియోజకవర్గ సమన్వయకర్త సాయిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్, స్థానిక నాయకులు చంద్రకాంత్‌రెడ్డి, గురునాథరెడ్డి పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో బి.వి.రామిరెడ్డి , ఆలూరులో నియోజకవర్గం సమన్వయకర్త గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో హోళగుంద, ఆలూరు మండల కన్వీనర్లు వీరన్న, షఫీవుల్లా పాల్గొన్నారు. ఇక్కడ రిలే నిరాహార దీక్షలు యదావిధిగా కొనసాగుతున్నాయి.
హాలహర్విలో మండల కన్వీనర్ భీమప్ప చౌదరి ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మ దహనం చేశారు. జననేత ఆమరణ దీక్షకు మద్దతుగా ఆత్మకూరులో 30 గంటల పాటు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పార్టీ నాయకులు ఇస్కాల రమేష్, ఏరువ రామచంద్రారెడ్డి నాయకత్వంలో పట్ణణంలో బంద్ విజయవంతమైంది. బనగానపల్లెలో ఎర్రబోతుల వెంకటరెడ్డి, బేతంచెర్లలో డోన్ నియోజకవర్గం సమన్వయకర్త బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కోడుమూరులో నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ బంద్‌ను పర్యవేక్షించారు. మంత్రాలయంలో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధం చేశారు. సర్పంచ్ చల్లబండ్ల బీమయ్య, ఉప సర్పంచ్ వెంకటేశ్వరరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. నందికొట్కూరులో పార్టీ నాయకులు ఐజయ్య, బండి జయరాజు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
పటేల్ సెంటర్‌లో వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టి రోడ్డును దిగ్బంధించారు. పత్తికొండలో నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. చక్రాల రోడ్డు నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. జేఏసి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. అలాగే వెల్దుర్తిలో కూడా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి పట్టణ బంద్‌ను పాటించారు. ఎమ్మిగనూరులో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు యథావిధిగా కొనసాగుతుండగా నంద్యాలలో ఏవి.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. ఆయా దీక్షల్లో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ.. టీనోట్‌ను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు.