హర్‌ దిల్‌మే వైఎస్సార్‌

Ysr Implemented Good Schemes To Muslims - Sakshi

మైనార్టీల ఆత్మబంధువై వారి జీవితాల్లో వెలుగులు నింపారు.. 4 శాతం రిజర్వేషన్లు కల్పించి వారికి సమాజంలో సమున్నత స్థానాన్ని అందించారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుల విప్లవం తీసుకువచ్చి పేద విద్యార్థుల ఉన్నత విద్యకు తోడ్పడ్డారు.. ముస్లింల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి. హర్‌ దిల్‌మే వైఎస్సార్‌ అంటూ ముస్లింలంతా మహానేతకు నీరాజనాలు అర్పిస్తున్నారు. 

సాక్షి, దెందులూరు: ముస్లింల వెనుకబాటుతనాన్ని చూసిన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వారికి రిజర్వేషన్లు వర్తింపజేశారు. బీసీ–ఈ జాబితాలో చేర్చి విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ 2004–05లో ఉత్తర్వులు జారీ చేశారు. కొంతమంది వ్యతిరేకించినా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆర్డినెన్స్‌ తీసుకువచ్చి.. 2007 జూలై 7న జీవో నంబర్‌ 23, బీసీడబ్ల్యూ(సీ2) జారీ చేశారు. ఆ నిర్ణయాలు సవాల్‌ చేస్తూ కొందరు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఫలితంగా ఆర్డినెన్స్‌ను నిలుపుదల చేస్తూ అప్పట్లో ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రిజర్వేషన్లు తాత్కాలికంగా రద్దయ్యాయి. 

15 ఉపకులాలకు వర్తింపు
హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో రిజర్వేషన్ల అమలుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, రాజ్యాంగ సూచిక ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చూడాలని ఆదేశించింది. దీంతో ముస్లింలకు కల్పించిన 5 శాతం రిజర్వేషన్లను 4 శాతానికి కుదించి వైఎస్సార్‌ అమలులోకి తెచ్చారు. ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్వయంగా చూసిన ఆయన వారి శాశ్వత అభివృద్ధి కోసం రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. నాలుగు శాతం రిజర్వేషన్లను 15 ముస్లిం ఉపకులాలకు వర్తింపజేశారు. దీంతోపాటు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కల్పించడంతో ఎందరో పేద ముస్లిం విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత చదువులు అభ్యసించగలిగారు. మంత్రివర్గంలో సైతం ముస్లిం ప్రతినిధులకు స్థానం కల్పించి ముస్లింల పాలిట ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రభుత్వపరంగా అన్నిరకాలుగా ఆదుకునేందుకు ముందుండేవారు. 

వైఎస్‌ చలువ వల్లే..
గతంలో ఏ ప్రభుత్వం కూడ ముస్లింల అభివృద్ధిని 
పట్టించుకోలేదు. మాది చింతలపూడి. నేను టైలరింగ్‌ చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ముగ్గురు పిల్లలు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్ల వల్ల నా పిల్లలు ముగ్గురూ టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తిచేశారు. వైఎస్‌ చలువ వల్ల పిల్లల భవిష్యత్‌పై మా కుటుంబానికి  బెంగ లేకుండా పోయింది. వచ్చే డీఎస్సీకి ప్రిపేర్‌ అవుతున్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చాక మెగా డీఎస్సీ ప్రకటించి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. జగన్‌ ఇచ్చిన హామీపై మాకు నమ్మకముంది.
– మహమ్మద్‌ జిలానీ, టైలర్, చింతలపూడి

టీడీపీ చిన్నచూపు 
2014లో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ముస్లిం అభివృద్ధిపై చిన్నచూపు చూసింది. గద్దెనెక్కిన తర్వాత నాలుగేళ్లపాటు బీజేపీతో కలిసి ఉండటంతో కనీసం మంత్రివర్గంలో ముస్లింలకు చోటుకల్పించలేదు. ముస్లిం సంక్షేమం కోసం ఎటువంటి నిధులు కేటాయించలేదు. ఇలా అన్నిరకాలుగా ముస్లింలు తెలుగుదేశం పార్టీ పాలనలో 
నిరాదరణకు గురయ్యారు. 

రిజర్వేషన్ల కల్పన చారిత్రాత్మకం
4 శాతం రిజర్వేషన్లను మా ముస్లింలకు కల్పించిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాకు అల్లాతో సమానం. ఆయన నిర్ణయం చారిత్రాత్మకం. ఎంతో మంది పేద ముస్లింలు నాలుగు శాతం రిజర్వేషన్‌తో లబ్ధి పొంది స్థిరపడ్డారు. 
–షేక్‌ చంటి, కొవ్వలి, దెందులూరు మండలం

వైఎస్సార్‌కు రుణపడి ఉంటాం
ముస్లింల అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పన వంటి రంగాల్లో దివంగత ముఖ్యమంత్రి 
డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన మేలును ఎన్నటికీ మరువలేం. ముస్లింలంతా వైఎస్సార్‌ కుటుంబానికి రుణపడి ఉంటారు. 
– షేక్‌ మీరాబీ, కొవ్వలి, దెందులూరు మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top