రాష్ట్రాన్ని చుట్టి.. ప్రజల మనసు తట్టి

YS Vijayamma And Sharmila Campaign Helps To YSRCP Grand Victory - Sakshi

పార్టీ విధానాన్ని ప్రజలకు వివరించిన విజయమ్మ

పంచ్‌ డైలాగులతో ఉర్రూతలూగించిన షర్మిల

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌ మాతృమూర్తి విజయమ్మ, సోదరి షర్మిల నిర్వహించిన ఎన్నికల ప్రచారం వైఎస్సార్‌సీపీ ఘనవిజయానికి అదనపు ఇంధనంగా పనిచేసింది. రాజన్న రాజ్య స్థాపన కోసం వారిద్దరూ పార్టీ ఎన్నికల ప్రచార వ్యూహంలో క్రియాశీలపాత్ర పోషించారు. వైఎస్‌ జగన్‌ పర్యటించలేని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించి ప్రచారాన్ని హోరెత్తించారు. విజయమ్మ ప్రచారం ప్రజల మనసులను సున్నితంగా తాకుతూ ఆలోచింపచేయగా.. షర్మిల ప్రచారం జంఝామారుతంలా ఓటర్లను ఉర్రూతలూగించింది. కేవలం 20రోజుల్లో విజయమ్మ 9 జిల్లాల్లో 27 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక 6 జిల్లాల్లో 39 నియోజకవర్గాల్లో షర్మిల నిర్వహించిన ఎన్నికల ప్రచారం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.

విజయమ్మ, షర్మిల తమదైన ప్రసంగాలతో ఓటర్లను ఆలోచింపజేశారు. కేసులకు భయపడి వైఎస్‌ జగన్‌ కేంద్రంతో రాజీపడ్డారన్న టీడీపీ దుష్ప్రచారాన్ని విజయమ్మ సమర్థంగా తిప్పికొట్టారు. ‘నా బిడ్డ ఆనాడు సోనియాగాంధీకే భయపడలేదు. ఇక మోదీకి భయపడతారా’అని నేరుగా ప్రశ్నించడం అందర్నీ ఆకట్టుకుంది. తండ్రిని చూసి పెరిగిన తన తనయుడు అదే విధంగా సంక్షేమ రాజ్యం అందిస్తారని ఆమె ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆమె ప్రసంగాలు వైఎస్సార్‌సీపీ పట్ల ప్రజల్లో మరింత సానుకూలతను పెంచాయి. ఇక షర్మిల ప్రచార హోరుతో రాష్ట్రాన్ని ఉర్రూతలూగించారు. వైఎస్సార్‌సీపీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదని చెబుతూ ‘సింహం సింగిల్‌గానీ వస్తుంది.. జగనన్న సింగిల్‌గానే వస్తాడు’ అన్న ఆమె ప్రసంగం జనంలోకి బాగా చొచ్చుకువెళ్లింది. చంద్రబాబు, లోకేశ్‌లతోపాటు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మీద ఆమె సూటిగా, ధాటిగా చేసిన విమర్శలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ‘బాబు వస్తే జాబు వస్తుందో రాదో తెలీదుగానీ కరువు మాత్రం వస్తుంది’, ‘బాబు వస్తే ఎవరికీ జాబులు రాలేదు కానీ పప్పుకు మాత్రం జాబ్‌ వచ్చింది’అంటూ ఆమె చలోక్తులకు ప్రజలు కేరింతలు కొట్టారు. షర్మిల తన ప్రసంగం చివర్లో ‘బాయ్‌ బాయ్‌ బాబు..’అంటూ చెబుతూ చివర్లో ‘బాయ్‌ బాయ్‌ పప్పు’ అంటూ వేసిన పంచ్‌ డైలాగులు బాగా పాపులర్‌ అయ్యాయి. సోషల్‌ మీడియాలో కూడా బాగా వైరల్‌గా మారి హల్‌చల్‌ చేశాయి.  

ఈ విధంగా విజయమ్మ, షర్మిల తమదైన శైలిలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేశారు. ఓటర్ల మనసు గెలుచుకున్నారు. పార్టీ ఘన విజయంలో తమ వంతు కీలక పాత్ర పోషించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top