Sakshi News home page

‘పుర’ భగీరథుడు వైఎస్సార్‌

Published Sun, Jul 8 2018 8:44 AM

YS Rajasekhara Reddy Jayanthi Celebrations In Anantapur - Sakshi

హిందూపురం అర్బన్‌: హిందూపురం ప్రాంత ప్రజల పాలిట అపర భగీరథుడుగా కీర్తింపబడుతున్నారు మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఈ ప్రాంత ప్రజల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.  దశాబ్దాల నుంచి దాహార్తితో తల్లడిల్లుతున్న హిందూపురం ప్రజలకు దాదాపు రూ.650 కోట్ల వ్యయంతో శ్రీరామరెడ్డి నీటిపథకం ద్వారా తాగునీరు అందించి వైఎస్సార్‌ ఇక్కడి ప్రజల ఇలవేల్పు అయ్యారు.
 
నియోజకవర్గంలోని 220 గ్రామాలకు తాగునీరు 
హిందూపురంలో 2008 సంవత్సరం వరకు ఇక్కడ ప్రతి కుటుంబం అటు తాగడానికి, ఇటు వినియోగానికి పూర్తిగా ప్రైవేటు ట్యాంకర్లపైనే ఆధారపడేది.  బిందె రూ.4 నుంచి రూ.5 వరకు కొనేవారు. ప్రతి కుటుంబం నెలకు నీటికోసమే రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకూ ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇలా దశాబ్దాలుగా పట్టణ ప్రజలు నీటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. మాజీ సీఎం ఎన్‌టీ రామారావు నుంచి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక అభిమానం అని చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వాలు ఇక్కడి ప్రజల దాహార్తిని తీర్చలేకపోయారు.  ఇంత నీటి ఎద్దడి ఉన్న  ప్రాంతానికి ప్రచారానికి విచ్చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్థానికుల వినతి మేరకు తాగునీటి సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం ఊహించని రీతిలో పీఏబీఆర్‌ నుంచి పైపులైన్ల ద్వారా నీటిని తరలింపజేసి రూ. 650 కోట్ల వ్యయంతో శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని చేపట్టారు.  దాదాపు 14 వందల కిలోమీటర్ల మేరకు పైపులైన్లు వేయించి 2008 డిసెంబరు 30న వైఎస్సార్‌ తన స్వహస్తాలతో నీటి పథకాన్ని ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం హిందూపురం ప్రజల దాహార్తిని తీర్చారు. వైఎస్సార్‌ పుణ్యమా అని పట్టణ ప్రజల దాహార్తి తీరడమే కాకుండా పక్కనున్న పరిగి మండలంతోపాటు హిందూపురం నియోజకవర్గం పరిధిలోని మొత్తం 220 గ్రామాలకూ తాగునీరు అందుతున్నాయి.

అయితే ఆయన తర్వాత గద్దెనెక్కిన పాలకుల స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు పథకాన్ని నిర్వీర్యం చేయడానికి యత్నాలు చేయడంతో పట్టణ ప్రజలకు పూర్తి స్థాయిలో నీరు అందకుండా పోతోంది. గొల్లపల్లి నుంచి ప్రత్యేక పైప్‌లైన్‌ ద్వారా నీటిని తీసుకువచ్చి గత వేసవికాలంలో అందిస్తానని బాలకృష్ణ చెప్పినా నేటి వరకు పనులు పూర్తి చేయలేకపోయారు.

జలయజ్ఞంలో  హిందూపురం ప్రజలకు భాగస్వామ్యం
జలయజ్ఞంలోనూ హిందూపురం ని యో జకవర్గ ప్రజలను వైఎస్సార్‌ భాగస్వామ్యం చేశారు. అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కింద మడకశిర ఉప కాలువ ద్వారా ఈ ప్రాంతంలో ని చెరువులకు నీరందించే బృహత్తర కార్యక్రమానికి మహానేత వైఎస్సార్‌ శ్రీకారం చుట్టారు. మడకశిర ఉపకాలువ కింద 55వ ప్యాకేజీ లో 64 కిలోమీటర్ల మేర కాలువను త వ్వేందుకు చొరవ తీసుకొన్నారు. మొదటిసారి రూ.48 కోట్లతో ఈ పనులను చేపట్టారు.

ఈ ప్యాకేజీ కింద హిందూపురం, పరిగి, లేపాక్షి, చిలమత్తూరు మండలాల పరిధిలో ఉన్న 99 చెరువులకు నీరందించడానికి అవకాశం కలిగింది. ఈ పనులను దాదాపు 90 శాతం మేరకు పూర్తి చేశారు. ఆయన తర్వాత గద్దెనెక్కిన పాలకులు ఈ పనులను నత్తనడకన చేపడుతూ వచ్చారు. గొల్లపల్లి నుంచి లేపాక్షి వరకు హంద్రీ–నీవా నీటిని తీసుకొచ్చేందుకు కాల్వలు పూర్తి చేశారు. కాని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కొన్ని అడ్డంకులు తొలగింపజేసి తాత్కలిక పనులు చేసిందేగాని పూర్తి స్థాయిలో చేపట్టి చిలమత్తూరు వరకు హంద్రీ–నీవా కాలువ నీటిని తీసుకురావడంలో మీనమేషాలు లెక్కిస్తోంది.

వైఎస్సార్‌ వల్లే సొంతింటి కల నెరవేరింది

లేపాక్షి: నేను 18 ఏళ్ల క్రితం కర్ణాటక నుంచి వలస కూలీగా లేపాక్షి గ్రామానికి వచ్చాను. నాకు స్వంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉండేవాళ్లం.  కనీసం భజంత్రి పనికి కూలీగా పోతే తప్ప పూటగడవని పరిస్థితి ఉండేది, చివరకు ఇంటి అద్దె చెల్లించలేకపోయాను. అయితే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు గృహనిర్మాణ పథకంను అమలు చేశారు. ఈ ఇందిరమ్మ ఇల్లు నిర్మించడానికి అప్పటి ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసి ఇల్లులేని నిరుపేదలను గుర్తించి ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లును కూడా మంజూరు చేసింది. దీంతో నా సొంతింటి కల నెరవేరింది. ప్రస్తుతం కుటుంబసభ్యులతో సొంతింటిలో హాయిగా ఉన్నాను. ఎవరైనా ఇంటిని నిర్మించుకోలేక అసంపూర్తిగా ఉన్న ఇంటికి కూడా ప్రత్యేక నిధులు మంజూరు చేసిన మహానేత వైఎస్సార్‌. ఆయన రుణం ఎన్నిటికి తీర్చుకోలేను.

శ్రీనివాసులు పిల్లిగుండ్ల కాలని, లేపాక్షి

నాకు ప్రాణం పోసిన దేవుడు రాజన్న

హిందూపురం టౌన్‌: నా పేరు పూల ముద్దమ్మ, ఏదో కూలీనాలి చేసుకొని బతుకుతున్నాను. 2012లో కూలి పని చేస్తుండగా ఉన్న పళంగా గుండె నొప్పితో పడిపోయాను. నా భర్త వెంటనే హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించాడు. ఆస్పత్రిలో గుండెకు బైపాస్‌ సర్జరీ చేయాలన్నారు. ఆపరేషన్‌కు డబ్బులు లేక మందులు వాడి మిన్నుకుండిపోయాను. వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయ్యాక ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం గురించి గ్రామంలోని పలువురు వివరించారు. వెంటనే వైద్యులను సంప్రదించగా, వారు గుంటూరు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి పంపించి, దాదాపు రూ.4 లక్షలు అయ్యే బైపాస్‌ సర్జరీని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేయించారు. ఆ మహానేత రాజన్న ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీనే నన్ను కాపాడింది. నాకు ప్రాణం పోసిన దేవుడు రాజన్న. నేటిక ఆయన ఫొటోను దేవున్ని పూజించే గదిలో ఉంచి పూజిస్తున్నాము.

 

పూలముద్దమ్మ, మోతుకపల్లి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement