ఈ ప్రగతి నీ చలువే..

YS Rajasekhara Reddy 9th Death Anniversary - Sakshi

వైఎస్‌ హయాంలో అభివృద్ధి పరుగులు

సాగునీటి పనుల్లో ప్రత్యేక ముద్ర

ఒకటా.. రెండా సంక్షేమ పథకాలతో 

లబ్ధి పొందిన కుటుంబాలు లక్షల్లో

జిల్లా అభివృద్ధిపై చెరగని సంతకం

వ్యవసాయం.. సంక్షేమం..అన్ని రంగాల్లో అభివృద్ధిలో నిర్లక్ష్యానికి గురైన చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చెరగని ముద్ర వేశారు దివంగత మహానేత వైఎస్సార్‌. 2004లో ముఖ్యమంత్రి కాగానే జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపారు.  ఒకటి కాదు రెండు కాదు జిల్లా అభివృద్ధిలో ఆయనది చెరగని ముద్ర. 108, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల సృష్టికర్తగా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయారు. 2009 సెప్టెంబర్‌ 2న చిత్తూరులోని అనుప్పల్లెలో జరిగే రచ్చబండకు  రావాల్సిన ఆయన హెలికాప్టర్‌ ప్రమాదంలో అశువులు బాసారు. ఆయన భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో మనసున్న మారాజుగా చిరస్థాయిగా నిలచిపోయారు. ఆదివారం ఆయన వర్ధంతి సందర్భంగా..
చిత్తూరు, సాక్షి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 
జిల్లాలో 11.2 వేల బలహీనవర్గాల కుటుంబాలు.. 50 వేల ఎస్సీ కుటుంబాలు, 768 ఎస్టీ కుటుంబాలు, 15.3 వేల మైనార్టీ కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందాయి. జిల్లాలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద 4.2 లక్షల మంది విద్యార్థులు లాభపడ్డారు. డాక్టర్లు, ఇంజినీర్లుగా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

పేదలకు ఆరోగ్య సిరి..
ఆరోగ్యశ్రీ  పథకాన్ని 2007లో ప్రవేశపెట్టారు. 942 వ్యాధులకు ఉచితంగా చికిత్స అందించారు. జిల్లాలో క్యాన్సర్‌ బాధితులే 30 వేల మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందారు. 56.4 వేల మంది గుండెజబ్బు బాధితులు ప్రాణాపాయం నుంచి  బయటపడ్డారు. పుట్టుకతోనే బధిరుడిగా జన్మించిన చిన్నారులకు కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ అమర్చేందుకు ఒక్కొక్కరికి రూ.6.5 లక్షలు వెచ్చిం చారు. నగరిలో వంద పడకల ఆస్పత్రిని తెరిపించారు. 

రైతే రాజు..
దశాబ్దాల పాటు వరుసగా కరువు కాటకాలతో రైతులు అప్పుల పాలయ్యారు. ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న రోజులవి. 2004 నుంచి జిల్లాలో నూతన శకం ప్రారంభం అయింది రైతుకు. అన్నదాతలే వెన్నెముక అని నమ్మిన రాజశేఖర్‌ రెడ్డి వారి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్‌ ఫైలుపై తొలిసంతకం చేశారు. వేల కోట్ల రుణాలు ఒక్క సిరా పోటుతో రద్దు చేశారు. 1998 జులై 1 నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలన్నింటికీ రూ.1.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. జిల్లాలో 22 మంది రైతులకు సహాయం అందింది. సోమశిల– స్వర్ణముఖి కాలువ తవ్వకం వల్ల లక్ష ఎకరాలు సాగులోకి వచ్చింది. హంద్రీనీవా ప్రాజెక్టు పనులు ఆయన కాలంలో ఎక్స్‌ప్రెస్‌లా జరిగాయి. జిల్లాలో వరి దిగుబడి రెండున్నర రెట్లు పెరిగింది. ఒక్క సారి కూడా విద్యుత్‌ చార్జీ పెంచలేదు. జిల్లాలో రూ.120 కోట్ల వ్యవసాయ విద్యుత్‌ బకాయిలు మాఫీ చేశారు. చిత్తూరు షుగర్‌ ఫ్యాక్టరీకి రూ.10 కోట్లు కేటాయించి తెరిపించారు. 13 వేల మంది చెరకు రైతులకు మేలు జరిగింది. పాడి రైతులకు భరోసా ఇస్తూ 2006 మహిళా సంఘాల ఆధ్వర్యంలో బీఎంసీ(బల్క్‌ మిల్క్‌ సెంటర్స్‌) తెరిచారు. దీంతో పాడి రైతులు ఆర్థికంగా స్థిర పడ్డారు. 

భూ దాత ..మహానేత
జిల్లాలో వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచారు. ముఖ్యమంత్రిగా పని చేసిన ఐదు సంవత్సరాల కాలంలో జిల్లాలో రెండు విడతల్లో శ్రీకాళహస్తిలో 26 వేల ఎకరాలు, చంద్రగిరిలో 102 ఎకరాలభూమిని పేదల పరం చేశారు. వారి జీవితాల్లో నిండు వెలుగులు నింపారు. 

తిరుపతిలోనే 12వేల ఇళ్లు
సొంత ఇళ్లు ప్రతి ఒక్కరికీ కల. దీన్ని నెరవేర్చేందుకు రాజశేఖర్‌రెడ్డి అహర్ని«శలు శ్రమించారు. జిల్లాలో ఆయన ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం భాగంగా 3.04 లక్షల ఇళ్లు నిర్మించారు. దీనికోసం రూ.243.32 కోట్లు ఖర్చు చేశారు.  ఒక్క తిరుపతిలోనే దాదాపు 12వేల ఇళ్లు పేదలకు కట్టించి ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ కాలనీలు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్సార్‌దే. ఆయన హయాంలో కుప్పం నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పరుగులు పెట్టింది. శాంతిపురంలో ఐటీఐ కళాశాల నిర్మించారు.  కుప్పం పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ.51 కోట్లతో పాలారు డ్యాంను నిర్మించేందుకు తలపెట్టగా చంద్రబాబు నాయుడు అడ్డుపుల్ల వేశారనే అపవాదు ఉంది. రాజన్న నిన్ను మరవలేం అంటూ జిల్లా ప్రజలు వైఎస్సార్‌ను తలచుకుంటూనే ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top