
నేడు జగన్ రాక
సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఓటములపై సమీక్షించడంతో పాటు నేతల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జిల్లాకు వస్తున్నారు.
సాక్షి, రాజమండ్రి :సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఓటములపై సమీక్షించడంతో పాటు నేతల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జిల్లాకు వస్తున్నారు. రాజమండ్రిలో అయిదు జిల్లాలకు చెందిన పది పార్లమెంటు నియోజకవర్గాల్లో పరిస్థితిని ఆయన సమీక్షిస్తారు. పార్లమెంటు నియోజకవర్గాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోని ముఖ్యనేతలతో వరుస సమావేశాలు నిర్వహించి ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ పరిస్థితిని జగన్ చర్చిస్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బలమైన, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించే విధంగా, ప్రజల పక్షాన నిలిచి నిర్మాణాత్మకంగా వ్యవహరించే దిశగా క్యాడర్‌ను జగన్ ఉత్తేజపరచనున్నారు. బుధవారం నుంచి మూడురోజుల పాటు వరుసగా ఈ సమీక్షలు కొనసాగనున్నాయి.
జిల్లా సమీక్షలు పూర్తిచేసిన ప్రత్యేక బృందాలు
ఇప్పటికే జిల్లాల వారీగా పార్టీ ప్రత్యేక బృందాలు పర్యటించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించాయి. ఆయా ప్రాంతాల పరిస్థితులపై బృందాలు అధినేతకు నివేదికలు సమర్పించాయి. వాటిని అధ్యయనం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి నేతలతో చర్చించి వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. ఉభయగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పది పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నేతలు ఈ సమీక్షలకు హాజరవుతున్నారు. వీరందరితో అధినేత పార్లమెంటు నియోజకవర్గాల వారీగా విడివిడిగా సమావేశమై ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు అడిగి తెలుసుకుంటారు.
పార్టీని గ్రామస్థాయిలో ప్రజల వద్దకు తీసుకు వెళ్లి పటిష్టపరచడంతో పాటు రానున్న రోజుల్లో వ్యవహరించే తీరుపై నేతలకు జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు.జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి విమానంలో బుధవారం ఉదయం 10.00 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా రాజమండ్రి ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి చేరుకుని నియోజకవర్గాల సమీక్షలు ప్రారంభిస్తారు. తొలిరోజు ఉదయం 11.00 నుంచి కాకినాడ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలతో తన సమీక్షా కార్యక్రమాలు జగన్ ప్రారంభిస్తారు.