
బాబు మోసాలు త్వరలో వెలుగులోకి: వైఎస్ జగన్
ప్రజలను మోసం చేసిన అబద్దాలాడి పదవుల్లోకి రావాలనే ఉద్దేశ్యం తనకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రజలను మోసం చేసిన అబద్దాలాడి పదవుల్లోకి రావాలనే ఉద్దేశ్యం తనకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఓ వేళ అలా పదవిలోకి వేళ్తే ప్రజలకు సమాధానం చెప్పుకోలేమని అన్నారు. శనివారం విజయవాడలో కృష్ణాజిల్లా వైఎస్ఆర్ సీపీ నేతలతో వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లాకు చెందిన పార్టీ నాయకులను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడారు. మనం మరణించిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆయన అన్నారు. ప్రజల్లో ఏ ఒక్కరు మనం మోసం చేశామని చెప్పకోకూడదని జగన్ పేర్కొన్నారు.
నిజాయితీ, విశ్వసనీయతలతో కూడిన రాజకీయాల్లే చేయాలనుకున్నాం తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మోసాలు మరికొన్ని రోజుల్లో వెలుగులోకి వస్తాయని వైఎస్ జగన్ వెల్లడించారు. మరో కొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రైతులు రుణాల కోసం బ్యాంకులకు వెళ్తారు. అప్పటిలోగా రుణమాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రుణమాఫీపై కమిటీ ఏర్పాటు చేసి కాలయాపన చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జగన్ సూచించారు.