ఆస్పత్రి నుంచి వైఎస్‌ జగన్‌ డిశ్చార్జ్‌ 

YS Jagan discharge from the hospital - Sakshi

కుట్లు చిట్లిపోకుండా చేతికి సర్జికల్‌ బ్యాగ్‌ అమర్చిన వైద్యులు 

ఇంకా రావాల్సి ఉన్న రక్త నమూనాల రిపోర్టు

అభిమానుల ‘జై జగన్‌’ నినాదాలతో మార్మోగిన ఆస్పత్రి ప్రాంగణం

భారీ భద్రత మధ్య లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి చేరుకున్న జగన్‌

సాక్షి, హైదరాబాద్‌: విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం జరిగిన హత్యాయత్నం ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ని శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. కత్తిపోటుకు గురై తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఆయన్ను చికిత్స కోసం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని సిటీన్యూరో సెంటర్‌లో చేర్పించగా.. డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్‌ శివారెడ్డి, డాక్టర్‌ మధుసూదన్, డాక్టర్‌ జ్ఞానేశ్వర్‌లతో కూడిన వైద్య బృందం ఆయన ఎడమచేతి భుజానికి తొమ్మిది కుట్లు వేయడం తెలిసిందే. కత్తిపోటు గాయం నుంచి సేకరించిన రక్త నమూనాల రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది.

వైద్యుల సూచన మేరకు ఆయన గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకూ ఆస్పత్రిలోనే ఉన్నారు. తల్లి వైఎస్‌ విజయమ్మ, సోదరి షర్మిల, సతీమణి వైఎస్‌ భారతి రోజంతా ఆస్పత్రిలోనే ఉన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. గాయానికి వేసిన కుట్లు చిట్లిపోకుండా ఉండేందుకు ఎడమ చేతికి సర్జికల్‌ బ్యాగ్‌ అమర్చారు. ఆయన చికిత్స పొందిన ఆస్పత్రి నాలుగో అంతస్థు నుంచి లిఫ్ట్‌లో కిందికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న అభిమానులు, పార్టీ కార్యకర్తలను చిరునవ్వుతో పలకరించారు. ఆ సమయంలో ఆ ప్రాంగణమంతా ‘జై జగన్‌’.. నినాదాలతో హోరెత్తింది. భారీ భద్రత మధ్య ఆస్పత్రి నుంచి ఆయన నేరుగా లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.  
ఆస్పత్రిలో ఉన్న వైఎస్‌ జగన్‌ను చూడటానికి వచ్చిన సందర్భంగా అక్కడే వేచి ఉన్న ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, షర్మిల, వైఎస్‌ భారతి 

వైఎస్‌ జగన్‌కు పరామర్శల వెల్లువ  
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్‌ జగన్‌ను పలువురు ముఖ్యులు పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో.. తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రిటైర్డ్‌ డీజీపీలు ఆంజనేయరెడ్డి, దినేష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్‌కే రోజా, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, వరప్రసాద్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, పేర్ని నాని, జొన్నలగడ్డ పద్మావతి, రెహమాన్, ఆలూరి సాంబశివారెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి డి.శ్రీనివాస్, ప్రముఖ పారిశ్రామిక వేత్త సజ్జల దివాకర్‌రెడ్డి దంపతులు తదితరులున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top