పక్షవాతం..ప్రాణాంతకం..!

World Paralysis Day Special Story - Sakshi

గోల్డెన్‌ అవర్‌లో  డాక్టర్‌ను సంప్రదించాలి

నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యం

ఆధునిక జీవన విధానంతో పెరుగుతున్న బాధితులు

వ్యాధిపై ముందస్తు  అవగాహన అవసరం

24న ప్రపంచ పక్షవాత  నివారణ దినం

గురజాలకు చెందిన వెంకటేశ్వర్లు ఏడాది క్రితం పక్షవాతానికి గురయ్యాడు. చుట్టుపక్కల వారి మాటలు విన్న ఆయన ఆకుపసరు మందు తీసుకుని మిన్నకుండిపోయాడు. దీంతో వ్యాధి తగ్గకపోగా శాశ్వత అంగవైకల్యానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆయన దివ్యాంగుల సర్టిఫికెట్‌ కోసం గుంటూరు జీజీహెచ్‌కు వచ్చాడు.   దివ్యాంగుల సర్టిఫికెట్ల కోసం వచ్చే వారిలో 80 శాతం మంది పక్షవాతాన్ని అశ్రద్ధ చేయడం వల్లే వికలాంగులుగా మారుతున్నారని, వారంతా మందులు వాడకుండా అంత్రాలు, ఆకుపసరులతో కాలం వెళ్లదీయటం వల్లే ఈ దుస్థితి నెలకొంటోందని న్యూరాలజీ వైద్యులు వెల్లడిస్తున్నారు.

గుంటూరు మెడికల్‌: పక్షవాతాన్ని వైద్య పరిభాషలో సెరిబ్రో వాస్క్యులర్‌ యాక్సిడెంట్‌ అని పిలుస్తారు. ఈజబ్బు సోకిన వారిలో శరీరంలో ఏదో ఒకభాగం చచ్చుబడుతుంది. ఒక భాగం (పక్షం) పడిపోతుంది కనుక పక్షవాతం అని పిలుస్తారు. రక్తనాళాల్లో రక్తం కొంత ఒత్తిడితో ప్రవహిస్తుంటుంది. రక్తంలోని ఒత్తిడి పెరిగితే కొంత పరిమితి వరకు రక్తనాళాలు ఒత్తిడిని తట్టుకుంటాయి. ఆ ఒత్తిడి బాగా పెరిగితే కొంత రక్తస్రావం జరుగుతుంది. మెదడులో రక్తస్రావం జరిగినా, రక్తం గూడు కట్టినా పక్షవాతం వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా పక్షవాతంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జూన్‌ 24 ఏటా ప్రపంచ పక్షవాత నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

పక్షవాతానికి కారణాలు..
మెదడుకి వెళ్లే రక్తనాళం గాని, మెదడులోని రక్తనాళం గాని పూడుకుపోవటం వల్ల రక్తం సరఫరా ఆగిపోతే పక్షవాతం వస్తుంది. మెదడులో కణుతులు, రక్తపోటు పెరగటం, పొగతాగడం, మద్యపానం వల్ల  రక్తనాళాలు దెబ్బతిని పక్షవాతం వస్తుంది. రక్తంలో కొవ్వు పదార్ధాలు (కొలెస్ట్రాల్‌)వల్ల, స్థూలకాయం వల్ల వ్యాధి వస్తుంది.

లక్షణాలు ఇవి..
పక్షవాతం వచ్చినప్పుడు  కొందరికి ఒకే వస్తువు రెండుగా కనబడతుంది. మాట తడబడటం, అయోమయంగా మాట్లాడటం, మింగుడు పడకపోవటం, నీరు కూడా సరిగా తాగలేకపోవడం, నీరు తాగబోతే ముక్కు వెంట కొంత బయటకు రావడం, కళ్లు తిరగడం, తల తిరగడం, అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి, వాంతులు, నడకలో తూలుడు, చేయి, మూతి ఒకవైపునకు ఒంకరపోవటం, దృష్టి మందగించడం, కాళ్ళు చేతులు ఉన్నట్టుండి బలహీన పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో రోగి అపస్మారక స్థితి (కోమా)లోకి వెళ్తాడు.

ముందస్తు జాగ్రత్తలు...
కొన్ని సందర్భాల్లో ప్రాణాలు  హరించి వేసే పక్షవాతం బారిన పడకుండా ఉండాలంటే ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. షాలిష్‌ బియ్యం కాకుండా ముడి బియ్యం తినాలి. రాగులు, సజ్జలు, జొన్నలు లాంటి చిరుధాన్యాలు తీసుకోవాలి. ప్రతిరోజూ యోగా, నడవడం చేయడం మంచిది. జీవనశైలిని మార్చుకోవాలి. ఇంట్లో, బయట పొల్యూషన్‌కు దూరంగా ఉండాలి.  రక్తపోటు, షుగర్‌ వ్యాధిని అదుపులో పెట్టుకోవాలి. పొగ తాగరాదు. మద్యం సేవించరాదు. కొవ్వు పదార్ధాలు ఎక్కువగా తినకూడదు. స్థూలకాయం తగ్గించుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి.

పెరుగుతున్న బాధితుల సంఖ్య
గుంటూరు జీజీహెచ్‌ న్యూరాలజీ వైద్య విభాగంలో  2018 జనవరిలో 50 మంది, ఫిబ్రవరిలో 58 మంది, మార్చిలో 52 మంది, ఏప్రిల్‌లో 54 మంది, మే లో 51 మంది చికిత్స పొందారు. 2016లో 455 మంది, 2017లో 625 మంది పక్షవాతం బారిన పడి చికిత్స పొందారు. జిల్లాలో 20 న్యూరాలజీ స్పెషాలిటి ఆస్పత్రులు ఉన్నాయి. ప్రతిరోజూ ఒక న్యూరాలజీ వైద్యుడు ఒకరు లేదా ఇరువురు పక్షవాత బాధితులను కొత్తగా గుర్తించి వైద్యసేవలు అందిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top