ఇక సొగసైన రైల్వేస్టేషన్‌! | Visakhapatnam Railway Station Remodeling soon | Sakshi
Sakshi News home page

ఇక సొగసైన రైల్వేస్టేషన్‌!

Jun 30 2018 11:38 AM | Updated on Jun 30 2018 11:38 AM

Visakhapatnam Railway Station Remodeling soon - Sakshi

ఆధునీకరణ జరగనున్న స్టేషన్‌ (ఇన్‌సెట్‌) మాట్లాడుతున్న డీఆర్‌ఎం మాథుర్‌ ఇకపై బుకింగ్‌ కౌంటర్లు ఇలా ఉంటాయి

సాక్షి, విశాఖపట్నం: పరిశుభ్రతలో నంబర్‌ వన్‌ స్థానం దక్కించుకున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ సరికొత్త అందాలను సంతరించుకోనుంది. విమానాశ్రయం తరహాలో ఆధునిక హంగులను సమకూర్చుకోబోతోంది. ఇందు కోసం స్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు(ఎస్‌ఆర్‌డీపీ) కింద రైల్వే బోర్డు రూ.10 కోట్లు మంజూరు చేసినట్టు వాల్తేరు డివిజనల్‌ మేనేజర్‌(డీఆర్‌ఎం) ముకుల్‌ శరణ్‌ మాథుర్‌ వెల్లడించారు. శుక్రవారం ఆయన తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. వాల్తేరు డివిజన్‌లో విశాఖపట్నంతో పాటు సంబల్‌పూర్, కటక్‌ స్టేషన్లు ఎస్‌ఆర్‌డీపీకి ఎంపికయ్యాయని చెప్పారు. రీడెవలప్‌మెంట్‌కు సంబంధించి వివిధ డిజైన్లను రూపొందించి రైల్వే బోర్డు ఆమోదానికి పంపుతున్నామన్నారు. స్టేషన్‌ ప్రధాన ద్వారానికి పాలీ కార్బనేట్‌తో డూమ్‌ (టెంట్‌ మాదిరి) ఆకృతిని, స్టేషన్‌ ఎదుట ఉన్న నడకదారి వెంబడి పచ్చదనం పరుస్తామని, లైటింగ్‌ ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

వెయిటింగ్‌ హాళ్లను మెరుగు పరుస్తామని, బుకింగ్‌ కౌంటర్లను ఆధునీకరిస్తామని, ఒకటో నంబరు ప్లాట్‌ఫారంపై వివిధ రంగుల చిత్రాలతో సెల్ఫీ పాయింట్‌ను రూపొందిస్తామని చెప్పారు. మంచినీటి ట్యాప్‌లను స్టీల్‌వి సమకూరుస్తామని, ఒకటి, ఎనిమిదో నంబర్ల ప్లాట్‌ఫారాలపై ప్రయాణికులు జారకుండా యాంటీ స్కిడ్‌ గ్రానైట్‌ ఫ్లోర్‌ వేస్తామని, క్లాక్‌రూమ్‌ను విస్తృతం చేస్తామని, కియాస్కులను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. 15–20 రోజుల్లో ఈ పనులకు టెండర్లు పిలుస్తామని, ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. జ్ఞానాపురం వైపు స్టేషన్‌ అభివృద్ధి, విస్తరణకు ఆస్కారం ఎక్కువ ఉందన్నారు. ఐఆర్‌సీటీసీ అక్కడ స్థానిక రుచులతో మల్టీక్యుజిన్‌ రెస్టారెంట్‌ను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోందన్నారు. సీఎస్సార్‌ కింద హెచ్‌పీసీఎల్‌ ఇచ్చిన రూ.50 లక్షలతో స్టేషన్లో ‘ఫ్రెష్‌ ఇన్‌ లాంజ్‌’పేరుతో ప్రపంచ శ్రేణి మరుగుదొడ్లను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. బీచ్‌రోడ్డులో నమూనా రైలింజన్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, ఎస్కలేటర్లను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. రైల్వేస్టేషన్లో ఎమ్మార్పీ అతిక్రమించే స్టాళ్ల లైసెన్సులు రద్దు చేస్తామని, ప్రయాణికులు కూడా ఎమ్మార్పీయే చెల్లించాలని డీఆర్‌ఎం సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement