కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

Untimely rainfall in the AP - Sakshi

25నే అల్పపీడనం తమిళనాడు వైపు పయనించనున్న వాయుగుండం

రాష్ట్రంలో అక్కడక్కడా కురిసిన అకాల వర్షాలు

ఒంటిమిట్టలో ఈదురుగాలులకు కూలిన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు

ప్రకాశం జిల్లాలో పిడుగుపాటుకు నాలుగేళ్ల బాలుడు మృతి

సాక్షి, విశాఖపట్నం/నెట్‌వర్క్‌: దక్షిణ చత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ కర్ణాటక వరకు తెలంగాణ, ఉత్తర కర్ణాటక మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తొలుత ఈనెల 26న శ్రీలంకకు ఆగ్నేయంగా హిందూ మహా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. అయితే మారిన వాతావరణ పరిస్థితుల్లో ఒకరోజు ముందే 25న అల్పపీడనం ఏర్పడనుందని సోమవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఆ తర్వాత ఈ అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారి శ్రీలంక తూర్పు ప్రాంతం మీదుగా వాయవ్య దిశలో తమిళనాడు వైపు పయనిస్తుందని వివరించింది. మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమల్లో మంగళవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అదే సమయంలో కోస్తాంధ్రలోని ఒకట్రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని ఐఎండీ తెలిపింది. బుధవారం నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో కొన్నిచోట్ల సాధారణంగాను, మరికొన్ని చోట్ల సాధారణంకంటే తక్కువగాను ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం అత్యధికంగా అనంతపురం, కర్నూలులో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. గడచిన 24 గంటల్లో చింతపల్లి, పెద్దాపురంలలో 3, డెంకాడ, పాడేరు, పాతపట్నం, కళింగపట్నం, ఓర్వకల్లుల్లో 2 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.

కొనసాగిన అకాల వర్షాలు
రాష్ట్రంలో పలుచోట్ల సోమవారం బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు చేసిన విద్యుత్‌ అలంకరణ కటౌట్లు విరిగి పడ్డాయి. కళ్యాణ వేదిక వద్ద వీఐపీ షెడ్స్‌పై రేకులు ఎగిరిపోయాయి. జర్మన్‌ తరహా షెడ్స్‌ విరిగి పక్కనే ఉన్న విద్యుత్‌ తీగలపై పడ్డాయి. అక్కడున్న విద్యుత్‌ స్థంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలాయి. ట్రాన్స్‌కో ఏడీ వెంకటేశ్వర్లు, ఏఈ విజయకుమార్‌రెడ్డి వెంటనే సంఘటనా ప్రదేశాలకు చేరుకుని తక్షణ చర్యలు చేపట్టారు.

గాలులకు చుట్టుపక్కల గ్రామాల్లో సూమారు 100 ఎకరాల మేర అరటి, నూగు పంటలు నేలకు ఒరిగాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురంలో పిడుగు పడి నాలుగేళ్ల బాలుడు సుశాంత్‌ నాయక్‌ చనిపోగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. చాలా మండలాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల బొప్పాయి, మొక్కజొన్న, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. చిత్తూరు జిల్లా మదనపల్లె, నిమ్మనపల్లె మండలాల్లో పిడుగులు పడి భారీ వృక్షాలు నేలకొరిగాయి. గంగవరం మండలంలో కురిసిన వర్షానికి జీఎల్‌ఎస్‌ ఫారం ఉన్నత, ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ కూలిపోయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top