సమాంతర కాలువే ప్రత్యామ్నాయం

Tungabhadra reservoir filled to capacity - Sakshi

సామర్థ్యం మేరకు నిండిన తుంగభద్ర జలాశయం 

హెచ్చెల్సీ, ఎల్లెల్సీలకు విడుదల చేసింది కేవలం 20.26 టీఎంసీలే  

కాలువల ప్రవాహ సామర్థ్యం తక్కువగా ఉండటం, ఆధునీకరించకపోవడమే కారణం 

హెచ్చెల్సీకి సమాంతరంగా వరద కాలువ తవ్వాలని నిపుణుల సూచన  

కర్ణాటక సైతం అంగీకరిస్తే నిర్ణయం తీసుకోవడానికి తుంగభద్ర బోర్డు సిద్ధం

సాక్షి, అమరావతి:  తుంగభద్ర జలాశయంలోకి సోమవారం వరకూ 396.71 టీఎంసీల ప్రవాహం వచ్చింది. పుష్కరకాలం తర్వాత తుంగభద్ర జలాశయంలోకి వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే. ఇప్పటికీ జలాశయంలో 100.855 టీఎంసీల జలాలు నిల్వ ఉన్నాయి. తుంగభద్ర జలాశయం నుంచి ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేసింది కేవలం 20.26 టీఎంసీలే. ఇందులో హెచ్చెల్సీకి(ఎగువ కాలువ) 14.5 టీఎంసీలు, ఎల్లెల్సీకి(దిగువ కాలువ) 5.66 టీఎంసీలు విడుదల చేశారు.
 
కరువు పీడిత ప్రాంతాలకు మేలు  
బచావత్‌ ట్రిబ్యునల్‌ తుంగభద్ర జలాశయంలో 230 టీఎంసీల నీటి లభ్యత ఆధారంగా కేటాయింపులు చేసినా.. ఏడాదికి సగటున 150 టీఎంసీలకు మించి కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వినియోగించుకున్న దాఖలాలు లేవు. కాలువల ప్రవాహ సామర్థ్యం తక్కువగా ఉండటం.. ఆధునీకరించకపోవడం వల్ల గండ్లు పడటంతో వరద నీటిని ఒడిసిపట్టలేని దుస్థితి నెలకొంది. కర్ణాటక పరిధిలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీలను ఆధునీకరించడంతోపాటు హెచ్చెల్సీకి సమాంతరంగా కనీసం 20 వేల క్యూసెక్కుల సామర్థ్యం గల వరద కాలువ తవ్వితే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రయోజనకరంగా ఉంటుందని సాగునీటి రంగ నిపుణులు దశాబ్దాలుగా సూచిస్తున్నారు. ఈ సమాంతర కాలువ ద్వారా కర్ణాటకలో బళ్లారి జిల్లా, ఏపీలో అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో కరువు పీడిత ప్రాంతాలను సస్యశ్యామలం చేయవచ్చని స్పష్టం చేస్తున్నారు.  

ఆధునికీకరణ అసంపూర్ణం  
పూడిక పేరుకుపోవడం వల్ల తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం క్రమేణ తగ్గుతూ ప్రస్తుతం 100.855 టీఎంసీలకు చేరుకుంది. జలాశయం నుంచి 4,000 క్యూసెక్కులు విడుదల చేసేలా హెచ్చెల్సీ, 1,800 క్యూసెక్కులు విడుదల చేసేలా ఎల్లెల్సీని తవ్వారు. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుకు వచ్చేసరికి హెచ్చెల్సీ సామర్థ్యం 1500, ఎల్లెల్సీ సామర్థ్యం 725 క్యూసెక్కులకు పరిమితం చేశారు. హెచ్చెల్సీ, ఎల్లెల్సీలో మిగిలిన ఆధునీకరణ పనులను గత ఐదేళ్లుగా పూర్తి చేయకపోవడం వల్ల కాలువలకు ఎక్కడికక్కడ గండ్లు పడుతున్నాయి. దీనివల్ల సామర్థ్యం మేరకు కూడా నీటిని తరలించలేకపోతున్నారు. 

ఉభయ రాష్ట్రాలకూ లాభమే..
హెచ్చెల్సీ ప్రధాన కాలువ కర్ణాటకలో 104.587 కిలోమీటర్ల పొడవున ప్రయాణిస్తుంది. ఈ కాలువకు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో పీఏబీఆర్‌(పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌), మధ్య పెన్నార్, చాగల్లు, పెండేకళ్లు, వైఎస్సార్‌ జిల్లాలో చిత్రావతి, మైలవరం రిజర్వాయర్లను నిర్మించారు. ఈ జలాశయాల సామర్థ్యం 38 టీఎంసీలు. తుంగభద్ర జలాశయానికి ఏడాదికి సగటున 70 నుంచి 80 రోజులపాటు వరద ఉంటుంది. హెచ్చెల్సీకి సమాంతరంగా 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ తవ్వి, వరద రోజుల్లో నీటిని తరలిస్తే ఈ జలాశయాలను నింపవచ్చు. వరద ప్రవాహం నిలిచిపోయాక తుంగభద్ర జలాశయం నీటిని పీఏబీఆర్‌కు ఎగువన ఉన్న ఆయకట్టుకు.. ఎల్లెల్సీ, కర్ణాటక పరిధిలోని ఇతర ఆయకట్టుకు అందించవచ్చు. దీనివల్ల కర్ణాటక, ఏపీ, తెలంగాణలో దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించవచ్చని సాగునీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు. హెచ్చె ల్సీకి సమాంతరంగా కాలువ తవ్వడంతోపాటు ఎల్లెల్సీని పూర్తిగా ఆధునీకరించి ప్రవాహ సామర్థ్యం పెంచాలంటూ ఏపీ  ఇప్పటికే ప్రతిపాదించింది.  కర్ణాటక ఆమోదముద్ర వేస్తే.. ఉభయ రాష్ట్రాలకూ ప్రయోజనకరమైన రీతిలో తుంగభద్ర బోర్డు నిర్ణయం తీసుకోవడా నికి సిద్ధంగా ఉందని అధికారులంటున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top