కొండంత కష్టం

Tribals Suffering in Agency Areas For Medical Tratment - Sakshi

25 కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో కొండలపై ప్రయాణం

బాలింతను మంచంపై మోసుకువచ్చిన గ్రామస్తులు

అడవిబిడ్డల ఆక్రందన ఆదివాసీలకు తప్పని జోలుమోత

బుట్టాయగూడెం: స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఆదివాసీ గిరిజనుల బతుకుల్లో మార్పులు రావడంలేదు. కష్టాలు తీరే మార్గంలేక వారి బాధలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. ఇప్పటికీ రహదారి సౌకర్యాలు లేక అనారోగ్యాల పాలయితే వాహన సౌకర్యాలు లేక తరాలుగా జోలు కట్టి ఆస్పత్రికి తీసుకువస్తున్నారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఇలాంటి సంఘటన పశ్చిమ ఏజెన్సీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేలేరుపాడు మండలం మోదేలుకు చెందిన కెచ్చెల లత అనే గర్భిణి ఆదివారం రాత్రి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం ఉదయం ఆమెకు ఫిట్స్‌ రావడంతో గ్రామస్తులు హుటాహుటిన మం చంపై ఆమెను 25 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో కొండలు దాటుకుంటూ బుట్టాయగూడెం మండలం డోలుగండి సమీపంలోని గానుగమామిడి చెట్ల సమీపం వరకు మోసుకువచ్చారు.

రేపల్లెలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వారిని చూసి సమాచారాన్ని దొరమామిడి పీహెచ్‌సీ సిబ్బందికి అందించారు. బాలింత ప్రమాద పరిస్థితిలో ఉందని వెంటనే అంబులెన్స్‌ పంపాలని సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. వెంటనే బాలింతకు దొరమామిడి ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం అందించి పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు అక్కడి నుంచి విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని లత దగ్గర ఉన్న ఏఎన్‌ఎం మంగ తెలిపారు. ఆమెకు వైద్య పరీక్షలు అందేలా అలివేరు ఏఎన్‌ఎంలు రాధ, మల్లిక చూస్తున్నారన్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది.

అయ్యో.. ఎంత కష్టం
బాలింతను మంచంపై  మోసుకుంటూ 25 కిలోమీటర్లు నడవడం చాలా కష్టం.  దట్టమైన అటవీ ప్రాంతంలో కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుంటూ ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా వైద్యం సకాలంలో అందించి బతికించుకోవాలనే గ్రామస్తుల తçపన పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది. వేలేరుపాడు మండలంలోని మోదేలు గ్రామం వేలేరుపాడుకు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో, బుట్టాయగూడెం మండలానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆ గ్రామానికి సంబంధించిన గిరిజనులు రేషన్‌ బియ్యాన్ని బుట్టాయగూడెం మండలంలోని అలివేరు గ్రామంలో తీసుకునేలా ఏర్పాటుచేశారు. త్వరలోనే వైద్య సేవలను  దొరమామిడి పీహెచ్‌సీలో అందించేలా ఏర్పాటు చేస్తున్నారు.

మోదేలుకి చెందిన గిరిజనులు ప్రతి శుక్రవారం కాలిబాటన బుట్టాయగూడెం మండలానికి నడిచివస్తూ రెండు రోజుల తర్వాత తిరిగి వెళ్తుంటారు. బాలింతను మాత్రం గంటల్లో మోసుకుంటూ సకాలంలో వైద్యం అందించేందుకు చాలా కష్టపడ్డారు. లంకపాకల నుంచి రేపల్లె వరకూ రోడ్డు నిర్మాణం చేపట్టినా ఇటీవల వర్షాలకు రోడ్డు బాగా దెబ్బతింది. కనీసం ఆ రోడ్డు మరమ్మతులు చేపట్టినా 10 కిలో మీటర్ల వరకూ వాహనాలు వెళ్తాయని గిరిజనులు అంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top