భారీ వర్షాలు | Today, tomorrow huge rains in the coastal area | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలు

Jul 18 2017 2:35 AM | Updated on Sep 5 2017 4:15 PM

భారీ వర్షాలు

భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడి మంగళవారం నాటికి వాయుగుండంగా మారనుంది.

నేడు, రేపు కోస్తాలో జోరు వానలు
- విశాఖ తీరంలో ఎగిసిపడుతున్న అలలు .. తీరం వెంబడి ఈదురుగాలులు
అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం హెచ్చరిక
 
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడి మంగళవారం నాటికి వాయుగుండంగా మారనుంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. మరోవైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర, రాయలసీమల మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో అనేకచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి వెల్లడించింది.

రాయలసీమలోనూ కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని తెలిపింది. అదే సమయంలో కోస్తాంధ్రలో పశ్చిమ దిశ నుంచి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. గడచిన 24 గంటల్లో శ్రీకాకుళం, రామచంద్రపురంలలో 5, కొయ్యలగూడెంలో 4, టెక్కలి, తిరువూరు, సోంపేట, పాతపట్నం, చింతూరు, మందస, నూజివీడు, కుకునూరు, కళింగపట్నంలలో 3 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.
 
మెట్టపైర్లకు ఊపిరి
ఒడిశా, పశ్చిమ బంగ్లా సమీపంలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం ప్రకారం కృష్ణా జిల్లా వత్సవాయిలో అత్యధికంగా 64 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం 54.5 మిల్లీమీటర్లు, తూర్పుగోదావరి జిల్లా బురదకాల్వ ప్రాంతంలో అతితక్కువగా 12.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

రాయలసీమ జిల్లాల్లో మాత్రం నామమాత్రంగానే వర్షాలు పడ్డాయి. ఇప్పటికే లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతోపాటు పత్తి, ఇతర మెట్ట పంటలు వేసిన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలకు ఈ వర్షాలు ఊపిరిపోసినట్టయింది. మంగళవారం కూడా కోస్తాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉండడం రైతులకు కలిసొచ్చే అంశంగా వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement