నేడు ‘సమైక్య’ బంద్ | Today samiyaka bandu | Sakshi
Sakshi News home page

నేడు ‘సమైక్య’ బంద్

Jan 3 2014 1:04 AM | Updated on Mar 18 2019 9:02 PM

అసెంబ్లీలో శుక్రవారం నుంచి తెలంగాణ బిల్లుపై చర్చించనున్న నేపథ్యంలో సీమాంధ్రలో మళ్లీ ఉద్యమం రగులుతోంది.

=వైఎస్సార్‌సీపీ, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు
 =తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మద్దతు
 =4న బైక్ ర్యాలీ, 7 నుంచి దీక్షలు : భాను

 
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : అసెంబ్లీలో శుక్రవారం నుంచి తెలంగాణ  బిల్లుపై చర్చించనున్న నేపథ్యంలో సీమాంధ్రలో మళ్లీ ఉద్యమం రగులుతోంది. వైఎస్సార్‌సీపీ, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. వ్యాపార, విద్యాసంస్థలు, ఉద్యోగ సంఘాలు, సినిమాహాళ్ల యాజమాన్యం సహకరించాలని సమైక్యవాదులు పిలుపునిచ్చారు.

అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ చేపట్టడాన్ని నిరసిస్తూ వారంరోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. జనవరి 3న బంద్, 4న బైక్ ర్యాలీలు, 7 నుంచి 10 వరకు నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. బంద్‌కు సహకరించాలని ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులను కోరినట్లు ఎన్జీవో నేతలు తెలిపారు.

ఈ ఆందోళనల్లో ఉపాధ్యాయులు కూడా పాల్గొంటారని సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి రాష్ట్ర కన్వీనరు మత్తి కమలాకరరావు తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం చేపట్టిన బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు పంచాయతీరాజ్ సర్వీసుల జాయింట్ యాక్షన్ కమిటీ గురువారం తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement