ప్రచారానికి నేటితో తెర | Today last day for campaign | Sakshi
Sakshi News home page

ప్రచారానికి నేటితో తెర

Aug 21 2017 3:34 AM | Updated on Oct 19 2018 8:10 PM

ప్రచారానికి నేటితో తెర - Sakshi

ప్రచారానికి నేటితో తెర

నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం సోమవారం సాయంత్రానికి ముగుస్తుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.సత్యనారాయణ తెలిపారు.

► సాయంత్రం 6 గంటల తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ జిల్లా వీడాలి  
►  వీవీ ప్యాట్‌తో రహస్య ఓటింగ్‌కు భంగం వాటిల్లదు
►  ఓటర్లయిన వారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా సెలవు వర్తింపు
► ఏఎస్‌డీ లిస్ట్‌లో ఉన్న ఓటర్లు ఏదో ఒక గుర్తింపు కార్డు చూపి ఓటు వేయొచ్చు
► విలేకర్ల సమావేశంలో కలెక్టర్‌ సత్యనారాయణ వెల్లడి


కర్నూలు (అగ్రికల్చర్‌):    నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం సోమవారం సాయంత్రానికి ముగుస్తుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.సత్యనారాయణ తెలిపారు. 21వ తేదీ 6 గంటల తర్వాత రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రచారాలు నిర్వహించరాదని చెప్పారు. ఆదివారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్లతో సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ... ఎన్నికల ప్రచారం సమయం ముగిసిన తర్వాత మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర స్థానికేతరులు జిల్లాను వదలి వెళ్లాలని ఆదేశించారు. 

ప్రచారం గడువు ముగిసిన తర్వాత అన్ని లాడ్జిలు, హోటళ్లు తనిఖీ చేసి స్థానికేతరులను బయటికి పంపే విధంగా పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. పోలింగ్‌ ప్రక్రియను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. నంద్యాల నియోజకవర్గంలో ఓటర్లయిన వారు జిల్లాలో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా 23న వారికి వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని కలెక్టర్‌ తెలిపారు.

ఏఎస్‌డీ లిస్ట్‌లో 24,748 మంది ఓటర్లు
నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,18,858 మంది ఉండగా 1,94,110 మందికి ఓటరు స్లిప్‌లను పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలిన 24,748 మంది ఓటర్లను ఏఎస్‌డీ లిస్ట్‌ (ఆబ్సెంట్, షిఫ్ట్‌టెడ్, డెత్‌)లో పెట్టామని, ఇందులో డబుల్‌ ఓటర్లు ఉంటారని, వీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్‌ సూచించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపాల్సి ఉంటుందని వివరించారు.

ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, బ్యాంకు పాసుపుస్తకం, పాస్‌పోర్టు, ఎన్‌ఆర్‌ఇజీఎస్‌ జాబ్‌ కార్డు, ఫొటో కలిగిన పెన్షన్‌ డాక్యుమెంట్, ఉద్యోగులయితే సంబంధిత అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డు, విద్యార్థులయితే విద్యాసంస్థ ఇచ్చిన గుర్తింపు కార్డు తదితర వాటిల్లో ఏదో ఒకటి చూపి ఓటు వేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఎన్నికల సంఘం కోరితే నివేదిక పంపుతాం  
ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు నంద్యాలలో కులాలు, మతాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ఓట్లు అడుగుతున్నారని దీనిపై చర్యలు తీసుకుంటున్నారా అంటూ ఒక విలేకరి ప్రశ్నించగా కలెక్టర్‌ స్పందించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల్లో కులం, మతం పేరుతో ఓట్లు అడగరాదని, దీనిపై ఎన్నికల కమిషన్‌ నివేదిక అడిగితే పంపుతామని స్పష్టం చేశారు.     

ఓటు ఎవరికి పడిందో తెలుసుకునే అవకాశం ఓటరుకు మాత్రమే  
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలకు మొదటి సారిగా వీవీపీఏటీను అనుసంధానం చేస్తున్నామన్నారు. ఓటర్లు బ్యాలెట్‌ యూనిట్‌పై గుర్తు నొక్కిన వెంటనే ఏ గుర్తుకు ఓటు వేశారో ఆ గుర్తుకు పడిందా లేదా అని వెంటనే బ్యాలెట్‌ యూనిట్‌కు పక్కనే ఉన్న స్క్రీన్‌పై ఏడు సెకండ్ల పాటు చూసుకోవచ్చన్నారు.

ఓటర్లు ఓటు ఎవరికి వేశారనేది ఓటరుకు తప్ప ఇతరులకు ఎంత మాత్రం తెలిసే అవకాశం లేదని వివరించారు. ఇటీవల వరకు జరిగిన ఎన్నికల్లో ఒక గుర్తుకు ఓటు వేస్తే మరో గుర్తుకు ఓటు పడుతుందనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఈ ఏర్పాటు చేసిందన్నారు. వీవీప్యాట్‌తో రహస్య ఓటింగ్‌కు ఎటువంటి భంగం వాటిల్లదని స్పష్టం చేశారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్పేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement