ప్రకాశం బ్యారేజీకి ముప్పు!

Threat to the Prakasham barrage! - Sakshi

బ్యారేజీకి దిగువన 50 మీటర్ల దూరంలోనే అడ్డగోలుగా కృష్ణా నదిలో ఇసుక తవ్వకం

దీని వల్ల బ్యారేజీకి ముప్పు తప్పదంటున్న నిపుణులు

ఎన్‌జీటీ ఉత్తర్వులు బేఖాతరు

ప్రభుత్వ పెద్దల దన్నుతో చెలరేగిపోతున్న ఇసుక మాఫియా

ఈ ఫొటో చూశారా.. ప్రకాశం బ్యారేజీ ఆఫ్రాన్‌కు కేవలం 50 నుంచి 60 మీటర్ల దూరంలోనే ఇసుకాసురులు ప్రొక్లెయిన్‌లతో కృష్ణా నదిలో ఇసుకను తవ్వేస్తున్న దృశ్యమిదీ.. బ్యారేజీలకూ.. బ్రిడ్జిలకు కనీసం 650 మీటర్ల దూరం వరకు నదిలో ఇసుకను తవ్వకూడదు. ఒకవేళ తవ్వితే బ్యారేజీకీ, బ్రిడ్జికీ ముప్పు తప్పదు. కానీ ప్రకాశం బ్యారేజీ.. రైల్వే బ్రిడ్జికి మధ్యన, కనకదుర్గ వారధి (జాతీయ రహదారిలోని రెండు వంతెనల) పక్కన కృష్ణానదిలో అడ్డగోలుగా ఇసుకను తవ్వేస్తున్నారనేందుకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. కృష్ణా నదీ గర్భంలో సీఎం చంద్రబాబు నివాసం అంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలోనే ఇసుక స్మగ్లర్లు చెలరేగిపోతున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. 

సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో ఇసుక తవ్వకంపై జాతీయ హరిత న్యాయస్థానం(ఎన్‌జీటీ) ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక తవ్వకానికి అడ్డుకట్ట వేయాలంటూ రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ రాష్ట్రసర్కారు ఏమాత్రం స్పందించడం లేదు. కృష్ణా నదిలో ఇసుక తవ్వకాన్ని అడ్డుకోకపోగా ‘ముఖ్య’నేత కనుసన్నల్లో ముగ్గురు మంత్రులు ఇసుక స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం బ్యారేజీకి ఎగువన, దిగువన కృష్ణా నదిలో భారీ ఎత్తున ర్యాంపులు ఏర్పాటు చేసి.. ఇసుకను తవ్వేస్తూ వందలాది కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ప్రకాశం బ్యారేజీలో నీటినిల్వ గరిష్టస్థాయిలో ఉండటం.. నదిలో నీటి ప్రవాహం ఉండటంతో విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి.. రైల్వే బ్రిడ్జికి మధ్యన ఉన్న ఇసుకపై స్మగ్లర్ల కళ్లు పడ్డాయి. ప్రకాశం బ్యారేజికి.. బ్రిడ్జికి మధ్య 800 నుంచి 900 మీటర్ల దూరం ఉంటుంది. ఈ మధ్యన నదిలో ఎలాంటి తవ్వకాలు జరపకూడదు.

ఒకవేళ తవ్వకాలు జరిపితే అటు ప్రకాశం బ్యారేజీకి.. ఇటు బ్రిడ్జికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు నదిలో ఇసుకను ప్రొక్లెయిన్‌లతో తవ్వకూడదని పర్యావరణ చట్టాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇసుక స్మగ్లర్లు ఇదేమీ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న నేతల దన్నుతో వారు చెలరేగిపోతున్నారు. ప్రకాశం బ్యారేజీ ఆఫ్రాన్‌ నుంచి ప్రొక్లెయిన్‌లు, ట్రాక్టర్లు, భారీ లారీలను గత మూడు రోజులుగా నదిలోకి దింపుతున్నారు. ప్రొక్లెయిన్‌లతో భారీ ఎత్తున ఇసుకను తవ్వి.. ఆఫ్రాన్‌ మీదుగా వాహనాల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. భారీ వాహనాల రాకపోకల వల్ల ఆఫ్రాన్‌ దెబ్బతింటుందని జలవనరులశాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఇదే అంశాన్ని తెలియజేస్తూ ప్రొక్లెయిన్‌లతో ఇసుక తవ్వకాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చాయని.. దాంతో మిన్నకుండిపోయామని ఆ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. బ్యారేజీకి కేవలం 50 నుంచి 60 మీటర్ల దూరంలో అడ్డగోలుగా ఇసుకను తవ్వేయడం వల్ల.. భారీ వరదలు వస్తే బ్యారేజీకి ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు. అక్రమార్జనకోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే దుస్సాహసానికి పాల్పడుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top