జిల్లాలో విద్యుత్ కోతలు మళ్లీ మొదల య్యాయి. మూడు రోజులుగా అనధికారికంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి శుక్రవారం జిల్లాలో అడుగుపెట్టారు.
సాక్షి, ఏలూరు :
జిల్లాలో విద్యుత్ కోతలు మళ్లీ మొదల య్యాయి. మూడు రోజులుగా అనధికారికంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి శుక్రవారం జిల్లాలో అడుగుపెట్టారు. పలువురు మంత్రులు సైతం జిల్లాలో ఉన్నారు. అరుునా ప్రజలకు విద్యుత్ కష్టాలు తప్ప లేదు. అక్కడా ఇక్కడ అని భేదం లేకుండా జిల్లావ్యాప్తంగా రెండు గంటలకు తక్కువ కాకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. శుక్రవారం ఏలూరు నగరంలో మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేదు. తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, పోలవరం నియోజకవర్గాల్లోనూ రెండేసి గంటల చొప్పున కోత విధించారు. డెల్టాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల మూడు, నాలుగు గంటలపాటు సరఫరా నిలిచిపోయింది. అయితే కోతల విషయమై విద్యుత్ శాఖ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.
వాతావరణంలో వేడి తగ్గి విద్యుత్ వినియోగం తగ్గుముఖం పట్టినా అకాల కోతలే మిటో ప్రజలకు అర్థం కావడం లేదు. దీనిపై తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) విశాఖపట్నంలోని కార్పొరేట్ కార్యాలయ లోడ్ మోనిటరింగ్ విభాగాన్ని ‘సాక్షి’ సంప్రదించగా, విద్యుత్ కొరత వల్లనే అత్యవసర లోడ్ రిలీఫ్ అమలు చేస్తున్నామని సిబ్బంది తెలిపారు. రాష్ట్రంలోని థర్మల్, హైడల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో దాదాపు 2వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. నగరాల్లో కోతలు విధించడం లేదని, కేవలం గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రెండుగంటల చొప్పున సరఫరా నిలిపివేసి వ్యవసాయ రంగానికి అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కానీ వ్యవసాయానికి నాలుగైదు గంటలు మించి సరఫరా కావడం లేదని రైతులు చెబుతున్నారు. మెట్ట ప్రాంతాల్లో పంటలు వేసిన రైతులు విద్యుత్ కోతలతో కలవరపడుతున్నారు.