
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టును రూ. 108 కోట్ల వ్యయంతో రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపాదిత పరిపాలనా నగరంలో నిర్మించబోయే శాశ్వత హైకోర్టుకు సమీపంలో ఇందుకోసం తాత్కాలికంగా ఒక భవనాన్ని నిర్మించనున్నారు.
తాత్కాలిక హైకోర్టును 4 ఎకరాల్లో జీ+2గా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. 1.8 లక్షల చదరపు అడుగుల గ్రాస్ ఫ్లోర్ ఏరియాలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. బుధవారం సచివాలయంలో జరిగిన సీఆర్‌డీఏ సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సమావేశం లో వివరించారు. ఈ భవనంలో ప్రధాన న్యాయమూర్తి కోసం రెండు వేల చదరపు అడుగుల్లో కోర్టు గది, 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఛాంబర్ ఉంటుందని తెలిపారు.
మరో వెయ్యి చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో 18 కోర్టు హాళ్లు, 600 చదరపు అడుగుల చొప్పున న్యాయమూర్తుల ఛాంబర్లు ఉంటాయని చెప్పారు. తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణాన్ని 6 – 8 నెలల్లోగా పూర్తి చేస్తామని తెలిపారు. వెంటనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని సీఎం సూచించారు. హైకోర్టు శాశ్వత భవనాల డిజైన్, నిర్మాణ ప్రణాళికలు ఫిబ్రవరి మొదటి వారంలో రానున్నాయని చెప్పారు. అసెంబ్లీ భవనం డిజైన్లు మరో 2 వారాల్లో వస్తాయన్నారు.