సాంకేతిక ప్రదర్శనలతో సృజనాత్మకత | Technical presentations creativity | Sakshi
Sakshi News home page

సాంకేతిక ప్రదర్శనలతో సృజనాత్మకత

Feb 19 2015 3:53 AM | Updated on Sep 2 2017 9:32 PM

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజాత్మక ఆలోచనలు సాంకేతిక ప్రదర్శనల ద్వారా వెలుగులోకి వస్తాయని జేఎన్‌టీయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ లాల్‌కిశోర్ అన్నారు.

కర్నూలు(జిల్లా పరిషత్): విద్యార్థుల్లో దాగి ఉన్న సృజాత్మక ఆలోచనలు సాంకేతిక ప్రదర్శనల ద్వారా వెలుగులోకి వస్తాయని జేఎన్‌టీయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ లాల్‌కిశోర్ అన్నారు. నగర శివారులోని జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాలలో మూడురోజుల పాటు నిర్వహించనున్న విజ్ఞానమేళాను బుధవారం వీసీ లాల్‌కిశోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి టెక్నికల్ ఎగ్జిబిషన్లు విద్యార్థుల్లోని సాంకేతిక సృజనాత్మకతను వెలికి తీయడంలో ఎంతో దోహదం చేస్తాయన్నారు. వీటి ద్వారా సాంకేతిక ప్రతిభ సామాన్యులకు కూడా అర్థమవుతుందన్నారు.
 
  కళాశాల చైర్మన్ పి. సుబ్బారెడ్డి, డెరైక్టర్ ప్రొఫెసర్ జయరామిరెడ్డి, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు నగరంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ప్రజలు సందర్శించవచ్చన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మద్దూర్‌నగర్ నుంచి కళాశాల వరకు బస్సులు ఉచితంగా నడుపుతామన్నారు. 125 టెక్నికల్ మోడల్స్, 20 ఎంటర్‌టైన్‌మెంట్ స్టాల్స్,  16 ఫుడ్‌స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు కేశవ మెమోరియల్ స్కూల్, కట్టమంచి విద్యాసంస్థలు, మాంటిస్సోరి విద్యాసంస్థలు, కేంద్రీయ విద్యాలయ తదితర పాఠశాలల విద్యార్థులు సైతం ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  
 
 సోలార్ పార్కు ఏర్పాటు
 కళాశాల ప్రాంగణంలో ఎలక్ట్రికల్ విభాగం ఆధ్వర్యంలో రూ.83.5లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సోలార్ పార్క్(రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్)ను వీసీ లాల్‌కిశోర్, నెడ్‌క్యాప్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోదండరామమూర్తి ప్రారంభించారు. ఆగ్రో సోలార్ కంపెనీచే రూపొందించిన  ఈ ప్లాంట్ 100 కిలోవాట్ల సామర్ధ్యం కలిగి ఉందని, దీనివల్ల కళాశాలలో ముప్పావు శాతం విద్యుత్ ఆదా అవుతుందని ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.  
 
 ఆకట్టుకున్న ప్రదర్శనలు
 అంతరించి పోయిన డైనోసార్‌ను పరిచయం చేయడం, జీపీఎస్ విదానం, సెన్సర్‌తో నడిచే ఎలక్ట్రిక్ కారు, స్నేక్ రోబోట్, ఎలక్ట్రికల్ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన స్మార్ట్‌గ్రిడ్ ఆకట్టుకుంది. ప్రస్తుతం దేశమంతటా కరెంటు సరఫరా ఒకే గ్రిడ్ కింద ఉందని, దేశంలో విద్యుత్ ఉత్పత్తి నీటి ద్వారా, బొగ్గుద్వారా అణుఇంధనం ద్వారా అవుతోందని, అదే విధంగా సాంప్రదాయేతర ఇందన వనరులైన సూర్యరశ్మి, అలలు, గాలిద్వారా ఉత్పత్తి చేస్తూ వీటన్నింటినీ ఒకే గ్రిడ్ ద్వారా కలిపి, అవసరమైన చోటుకు విద్యుత్ సరఫరా చేయడం ద్వారా విద్యుత్ రవాణాలో అంతరాయం తగ్గించవచ్చని విద్యార్థులు వివరించారు. వీటితో పాటు వివిధ పాఠశాలల విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్‌ఫేర్, కాలేజి విద్యార్థుల ఎంటర్‌టైన్‌మెంట్ స్టాల్స్, ఫుడ్‌స్టాల్స్ సందర్శకులను అలరించాయి.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement