ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఆ పాఠశాలకు శాపం

Teachers Shortage In Prakasam Government Schools - Sakshi

ప్రైవేట్‌ స్కూళ్లను కాదని ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను పంపుతున్న వెంకట్రాదిపాలెం వాసులు

ఐదుగురు విద్యార్థుల నుంచి 100 మందికి పెరిగిన హాజరు

అవసరానికి సరిపడా ఉపాధ్యాయులను నియమించని ప్రభుత్వం

అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని తల్లిదండ్రుల ఆగ్రహం

కందుకూరు: పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాల పేరు చెబితేనే తల్లిదండ్రులు ముఖం చాటేస్తున్న రోజులివి. ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను బతిమాలుకుని పాఠశాలలో చేర్పించాల్సిన పరిస్థితి. అలాంటిది కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాద్రిపాలెం గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తున్నారు. దాదాపు మూతపడే స్థాయిలో ఉన్న ఆ పాఠశాలలో నేడు 100 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గ్రామస్తుల చొరవతో ఆదర్శ పాఠశాలగా ఎదుగుతోంది కానీ ప్రభుత్వ సహకారం పూర్తిగా కరువైంది. కనీసం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో తిరిగి ప్రైవేట్‌ పాఠశాలకు తమ పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు.  

వెంకటాద్రిపాలెం గ్రామంలో చదువుకున్న యువకులంతా వెంకటాద్రిపాలెం వెల్ఫేర్‌ అసోసియేషన్‌గా ఏర్పడి గ్రామస్తుల్లో చైతన్యం తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వారు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను అభివృద్ధి చేసేందుకు నడుం బిగించారు. 2015–16లో కేవలం ఐదుగురు విద్యార్థులే ఉన్న పాఠశాలలో 2017–18 నాటికి 100 మంది విద్యార్థులను చేర్చారు. అలాగే కార్పొరేట్‌ స్కూల్స్‌కు దీటుగా పాఠశాలలో అన్ని వసతులు కల్పించారు. కానీ బోధనకు అవసరమైన ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలలో ప్రస్తుతం లేరు. కేవలం ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే ఉన్నారు. వీరిలో ఒకరు త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. మరో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని, పాఠశాల హెచ్‌ఎంతోపాటు గ్రామస్తులు విద్యాశాఖ మంత్రి దగ్గర నుంచి జిల్లా కలెక్టర్, డీఈఓ, ఎంఈఓలకు విజ్ఞప్తి చేశారు.

ఈ ఏడాది పాఠశాల ప్రారంభం కాకముందు నుంచే ఉపాధ్యాయుల నియామకం కోసం గ్రామస్తులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాల ప్రారంభమై 20 రోజులు గడిచినా ఇంత వరకు ఉపాధ్యాయులను నియమించలేదు. ఇప్పటికే ఇద్దరు విద్యా వలంటీర్లను గ్రామస్తులు నియమించుకున్నారు. వీరికి ప్రతి నెలా రూ.25 వేల జీతాన్ని గ్రామ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నుంచి చెల్లిస్తున్నారు. ఉపాధ్యాయుల కోసం ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ఉంటే తమ పిల్లల భవిష్యత్‌ నాశనం అవుతుందని, తిరిగి ప్రైవేట్‌ పాఠశాలలకు తమ పిల్లలను పంపిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలని ఊదరగొడుతున్న సర్కార్‌.. ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యానికి ఏ విధంగా పాటుపడుతోందో చెప్పడానికి వెంకటాద్రిపాలెం పాఠశాల నిదర్శనం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top