‘అధికార’ అండతో కుప్పంలో కీచకపర్వం

TDP supporter harrased women employee in Kuppam - Sakshi

ఉద్యోగినికి లైంగిక వేధింపులు

నిందితుడు ఆనంద్‌ ముఖ్యమంత్రి పీఏ మనోహర్‌ సన్నిహితుడు

బాధితురాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని తహసీల్దార్, స్థానిక పోలీసులు

చిత్తూరు కలెక్టరేట్‌ : ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంలో సైతం మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళా ఉద్యోగిపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి పీఏ మనోహర్‌కు సన్నిహితుడైన ఓ వీఆర్‌ఏ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తనకు లొంగకపోతే మార్ఫింగ్‌ చిత్రాలను సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. దీనిపై తహసీల్దార్, స్థానిక పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో ఆ మహిళ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాలు.. కుప్పం తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్‌ భవ్యను వీఆర్‌ఏ ఎం.ఆనంద్‌ కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీనిపై ఆమె తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసింది. అయినా న్యాయం జరగకపోగా వేధింపులు మరింత ఎక్కువవ్వడంతో స్థానిక పోలీసులను ఆశ్రయించింది. వారు కూడా పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. వీఆర్‌ఏ ఆనంద్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తన సెల్‌ఫోన్‌ను దొంగతనం చేసి.. అందులోని తన ఫోటోలను మార్ఫింగ్‌ చేసి మరొకరితో సంబంధం ఉన్నట్లు సృష్టించాడని వాపోయింది. తాను లొంగకపోవడంతో ఆ మార్ఫింగ్‌ ఫొటోలను రెవెన్యూ గ్రూప్‌లలో, సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేసింది. భవ్య ఫిర్యాదును స్వీకరించిన కలెక్టర్‌.. మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కీర్తిని విచారణ చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో దీనిపై విచారణ చేసిన కీర్తి శనివారం సాయంత్రం నివేదికను కలెక్టర్‌ ప్రద్యుమ్నకు అందజేశారు. దీని ఆధారంగా నిందితుడిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

సీఎం పీఏ అండదండలతో గతంలోనూ..
వీఆర్‌ఏ ఆనంద్‌కు ముఖ్యమంత్రి పీఏ మనోహర్‌ అండదండలున్నట్లు తెలిసింది. గతంలో కూడా కుప్పం ఎండీవో కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఆపరేటర్‌ను ఇలాగే వేధించినట్లు ఆరోపణలున్నాయి. కుప్పం పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను స్థానిక టీడీపీ నాయకుల పరం చేయడమే ఆనంద్‌ పని అని సహ ఉద్యోగులు చెబుతున్నారు. తొమ్మిదేళ్లుగా ఒకేచోట తిష్ట వేసి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాడని వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top