వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్‌కు ఆ పార్టీ నాయకులతో సమన్వయం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్‌కు ఆ పార్టీ నాయకులతో సమన్వయం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయనకు పార్టీలో సముచితమైన స్థానం లభించడం లేదని సమాచారం. జిల్లాలో వేలాది మంది టీడీపీ కార్యకర్తలు ఉన్నా, వారిలో పది శాతం కూడా మేయర్‌కు అనుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదని, ఆయన పార్టీలో ఒంటరి అయ్యారని ఆయన సన్నిహితులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారాయణ అండతో పార్టీలో చేరిన అబ్దుల్ అజీజ్‌ను జిల్లాలోని ఇతర నాయకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. నెల్లూరులో జరిగిన పలు కార్యక్రమాలు దీనికి ఊతమందిస్తున్నాయి. గత ఆదివారం తెలుగుదేశానికి చెందిన అనంతపురం జెడ్పీ చైర్మన్ చమన్‌ను మేయర్ ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఆ కార్యక్రమానికి టీడీపీ ముఖ్య నేతలు ఎవరూ రాక పోవడం గమనార్హం. దీంతో పాటు చమన్‌కు సన్మాన సభ నిర్వహిస్తున్నట్లు ప్రచురించిన ఫ్లెక్సీల్లో కూడా టీడీపీ నేతల పేర్లు, ఫోటోలు లేవు. చమన్‌ను పలకరించేందుకు టీడీపీ నేతలు ఎవరూ రాలేదు. దీనికి కారణం ఈ కార్యక్రమాన్ని అబ్దుల్ అజీజ్ ఏర్పాటు చేయడమేనని సమాచారం.
చమన్ సన్మాన సమాచారాన్ని టీడీపీ నాయకులకు చేరవేయలేదని అజీజ్‌పై ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనికి ముందు జరిగిన ఒక కార్యక్రమానికి నాయకులను ఆహ్వానించినా, ఎవరూ రాక పోవడం గమనార్హం. ఇటీవల ఎనిమిది, పదో డివిజన్లలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని అజీజ్ నిర్వహించారు. దీనికి పార్టీ నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రమేష్ రెడ్డి, అనూరాధలను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి వీళ్లెవ్వరూ హాజరు కాలేదు. అలాగే మంగళవారం 54వ డివిజన్‌లో నీరు-చెట్టు కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిం చారు. పార్టీ నేతలు ఎవరూ రాక పోవడంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. అబ్దుల్ అజీజ్ ఇంత వరకు మినీ బైపాస్ రోడ్డులో ఉన్న టీడీపీ కార్యాలయానికి రాక పోవడాన్ని కూడా తప్పు బడుతున్నారు.
ఇదిలా ఉండగా పార్టీలో అజీజ్ ఎదుగుదలను అడ్డుకునేందుకు పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏళ్ల తరబడి తాము పార్టీలో కొనసాగుతున్నామని, కొత్తగా అడ్డదారిలో వచ్చిన అజీజ్‌కు పార్టీలో ప్రాధాన్యం లేకుండా చేయడానికి, పార్టీలోని మరో వర్గం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా ఆయనను నెల్లూరు నగరానికి తీసుకొచ్చేందుకు అబ్దుల్ అజీజ్ ప్రయత్నించినట్లు తెలిసింది.
ఇందులో భాగంగా అజీజ్ ప్లెక్సీలు ఏర్పాటు చేయడం, నగరంలో రోడ్డుకు ఇరు వైపులా సున్నం చల్లడం, రోడ్లు శుభ్రం చేయించడం లాంటివి చేయించారు. నీరు-చెట్టు కార్యక్రమం నెల్లూరులో చేపడితే, అజీజ్ సీఎంకు సన్నిహితంగా మెలుగుతాడని భావించిన రెండో వర్గం ఆ కార్యక్రమాన్ని వెంకటాచలంలోనే పూర్తి చేయించారు. నగర కార్పొరేషన్ పరిధిలోకి రానివ్వకుండా చేయగలిగారు. అడ్డుంకులను ఎదుర్కొంటూ మేయర్ అబ్దుల్ అజీజ్ ఎంత కాలం ఎదురీదుతారో వేచి చూడాల్సిందే.