జాతర మాటున జాక్‌పాట్‌

TDP Leader Occupied Land Of Police Quarters In Kuppam - Sakshi

టీడీపీ నేతల తెలివి ముందు గంగమ్మ తల్లి కూడా బలాదూర్‌ 

 పోలీసులను బురిడీ కొట్టించిన వైనం 

గంగజాతర నిర్వహణ కోసమంటూ పోలీస్‌ క్వార్టర్స్‌ కూల్చివేత 

ప్రత్యామ్నాయం చూపని  గత ప్రభుత్వం 

టీడీపీ నేతల ఆలోచనలకు అంతే ఉండదు. వారి ఆలోచనలు ఎవరి ఊహకు కూడా అందవు. వారి అతి తెలివి ముందు పోలీసులు, తిరుపతి గంగమ్మ తల్లి కూడా మూగబోయారు. టీడీపీ హయాంలో నేతలంతా బంధుప్రీతి.. స్వలాభం కోసం పక్కా స్కెచ్‌ వేశారు. కుప్పంలో తిరుపతి గంగజాతర పేరిట, తమ బంధువుల భూముల విలువను పెంచుకునేందుకు ఏళ్ల కిందట నిర్మించిన పోలీస్‌ క్వార్టర్స్‌ను కూల్చేశారు. నిజంగానే గంగజాతర కోసమని నమ్మిన పోలీసులు ఆ క్వార్టర్స్‌ను ఖాళీ చేసి అద్దె ఇళ్లలో ఉంటున్నారు. పోలీసులకు ప్రత్యామ్నయం చూపిస్తామని నాడు హామీ ఇచ్చిన నేతలు ఇప్పుడు గల్లంతయ్యారు. 

కుప్పం : పట్టణంలో 25 ఏళ్ల కిందట పోలీసు శాఖకు ప్రత్యేకంగా మూడు అపార్ట్‌మెంట్లలో 12 గదులతో క్వార్టర్స్‌ను ఏర్పాటు చేశారు. దీని పక్కనే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ క్వార్టర్లను నిర్మించారు. మూడు రాష్ట్రాల కూడలి, దీనికితోడు కుప్పం మారుమూల ప్రాంతం కావడంతో అప్పట్లో పోలీసుల కోసం నిర్మించిన క్వార్టర్స్‌లో 12 కుటుంబాలు నివసించేవి. గత ప్రభుత్వం తిరుపతి గంగమ్మ జాతర నిర్వహణ కోసం స్థలం కావాలని, జాతర నిర్వహణలో భాగంగా అగ్నిగుండ ప్రవేశానికి స్థలం కోసం పోలీసు క్వార్టర్లను కూల్చివేసి స్థలాన్ని గంగమ్మ దేవస్థానానికి వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పోలీసు క్వార్టర్స్‌ ఉన్న స్థలం ఆటోస్టాండ్‌గా మారింది.  

అయితే అసలు కథ ఇదీ.. 
పోలీస్‌ క్వార్టర్స్‌ వెనుక టీడీపీ ముఖ్యనేత, చంద్రబాబు ప్రధాన అనుచరుడిగా ఉన్న పీఏ మనోహర్‌ సామాజిక వర్గానికి చెందిన బంధువుల పొలాలు ఉండేవి. వీటికి రోడ్డు సౌకర్యం లేదు. ముళ్లపొదలు, పందులకు ఆవాసం, చీకటి కార్యకలాపాలకు నిలయంగా ఈ ప్రాంతం ఉండేది. క్వార్టర్స్‌ తొలగిస్తే భూముల విలువ పెరుగుతుందని వారు భావించారు. కానీ అక్కడున్నది పోలీసు క్వార్టర్స్‌ కావడంతో కొంతకాలం స్తబ్దుగా ఉండిపోయారు. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే భూముల యాజమానులు నాటి సీఎం చంద్రబాబు పీఏ మనోహర్‌ను కలిసి క్వార్టర్స్‌ తొలగింపునకు చర్యలు చేపట్టాలని, అధికారులపై ఒత్తిడి తీసుకుని వచ్చారు. విమర్శలు వస్తాయని పసిగట్టి గంగమ్మ జాతర కోసమని ప్రజలను మభ్యపెట్టారు. జాతర నిర్వహణలో అగ్నిగుండ ప్రవేశానికి స్థలం కోసమని ప్రచారం చేపట్టారు. కాగా దేవస్థానం కోసం క్వార్టర్స్‌ వెనుక సర్వే నంబరు 128లో 40 సెంట్లు డీకేటీ స్థలం కేటాయించాలని గతంలో 2006లోనే అప్పటి దేవస్థాన పాలక మండలి ఫిర్యాదు చేసింది. ఈ స్థలం వదిలి క్వార్టర్స్‌ కూల్చివేయడంపై ఆరోపణలు వచ్చాయి. 

జోరుగా రియల్‌ ఎస్టేట్‌..
పోలీస్‌ క్వార్టర్లు కూల్చి రోడ్డు వేయడంతో ఇప్పుడు టీడీపీ అనుయాయుల పొలాల్లో భవనాలు లేస్తున్నాయి. అంతస్తుల మీద అంతస్తులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకుంది. మరోవైపు క్వార్టర్స్‌ కోల్పోయిన పోలీసులు అద్దె భవనాల్లో నివాసిస్తున్నారు. 

ప్రత్యామ్నాయం చూపని వైనం.. 
క్వార్టర్స్‌ కూల్చేశారు గానీ పోలీసు సిబ్బందికి క్వార్టర్స్‌ కోసం ప్రత్యామ్నాయ స్థలం కేటాయించడంలో గత ప్రభుత్వం విఫలమైంది. అప్పటి పోలీసు శాఖ ఉన్నతాధికారులు స్థానిక నేతలకు తెలియజేసినా పట్టించుకోలేదు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పానికి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో అప్పట్లో పోలీసు అధికారులు క్వార్టర్స్‌ కోసం నాయకులను అడగలేకపోయారు. తెలుగుదేశం పార్టీ నేతల మన్ననలు పొందేందుకు పోలీసు శాఖ స్థలాన్ని వదులుకుని ప్రస్తుతం క్వార్టర్స్‌ లేక ఇబ్బంది పడుతున్నారు.  

తప్పని ఇక్కట్లు 
ప్రస్తుతం కుప్పం సర్కిల్‌ పరిధిలో నాలుగు మండలాల పోలీసు స్టేషన్లలో పోలీసు శాఖ సిబ్బంది పెరుగుతున్నారు. డివిజన్లు కావడంతో రూరల్, అర్బన్‌ సర్కిళ్లుగా ఏర్పడ్డాయి. నాలుగు మండలాల్లో ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్‌ఐలతో పాటు వందమందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కుప్పం పట్టణంలోనే 35 మంది పోలీస్‌సిబ్బంది పని చేస్తున్నారు. పోలీసు శాఖకు క్వార్టర్స్‌ తప్పనిసరిగా నిర్మించాల్సి ఉంది. 

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.. 
గతంలో ఉన్న పోలీసు క్వార్టర్స్‌ను కూల్చివేసి.. పట్టణానికి దూరంగా ఉన్న స్థలాన్ని అప్పట్లో చూపించినట్లు తెలిసింది. కానీ పోలీసు క్వార్టర్స్‌కు స్థలాన్ని మాత్రం కేటాయించలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పోలీసు క్వార్టర్స్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.  – ఈదర్‌ బాషా, సీఐ, కుప్పం అర్బన్

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top