పోస్టల్‌ బ్యాలెట్‌లోనూ ప్రలోభాలు

TDP Cheating on Postal Ballot Visakhapatnam - Sakshi

అధికార పార్టీకి మేలు చేసేందుకే

పోస్టల్‌ బ్యాలెట్‌ జారీలో జాప్యమనే ఆరోపణలు

పోలింగ్‌ సిబ్బందితో పచ్చనేతల బేరసారాలు

తమకు అనుకూలంగా ఓట్లు పడేలా అధికారపార్టీ నానాతంటాలు

పోస్టల్‌ బ్యాలెట్‌పై ముసురుతున్న రాజకీయాలు

పారదర్శకంగా  జారీ చేశామంటున్న అధికారులు

అందలేదంటున్న పోలింగ్‌ సిబ్బంది

పోస్టల్‌ బ్యాలెట్‌లోనూ రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ముందు సామాజికవర్గాల వారీగానే కాకుండా.. ప్రత్యర్థి పార్టీల్లోని అసంతృప్తివాదులను కోట్లు కుమ్మరించి కొనుగోలు రాజకీయాలు చేసిన నేతలు పోస్టల్‌ బ్యాలెట్ల కొనుగోలుకు కూడా తెరతీసినట్టు చెబుతున్నారు.ప్రలోభాలకు లొంగని ఉద్యోగులపై అనేక విధాలుగా ఒత్తిడితీసుకువస్తున్నట్లు తెలిసింది.

సాక్షి, విశాఖపట్నం: పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో అధికారుల చెబుతున్న లెక్కలకు వాస్తవాలకు పొంతన లేకుండా ఉంది. తొలుత 11 వేల మందికి పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ చేశామని చెప్పిన అధికారులు.. ఆ తర్వాత కాదు కాదు 14 వేల మందికి   జారీ చేశామని చెప్పుకొచ్చారు. చివరకు ‘సాక్షి’లో వరుస కథనాలు నేపథ్యంలో పార్లమెంటు, అసెంబ్లీల వారీగా జారీచేసిన పోస్టల్‌ బ్యాలెట్‌  వివరాలను వెల్లడించారు. అసెంబ్లీ బ్యాలెట్‌లు అందితే లోక్‌సభ బ్యాలెట్లు, లోక్‌సభ బ్యాలెట్లు అందితే అసెంబ్లీ బ్యాలెట్లు అందకుండా గందరగోళం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో వైపు పోస్టల్‌ బ్యాలెట్‌కు  దరఖాస్తు గడువు ఏప్రిల్‌ 7వ తేదీ అనే విషయాన్ని  మాటమాత్రంగానైనా చెప్పలేదని ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బంది చెబుతున్నారు. తామే తెలుసుకుని దరఖాస్తు చేశామని, దరఖాస్తు చేసినా నేటికీ పోస్టల్‌ బ్యాలెట్‌ అందలేదని పలువురు పోలింగ్‌ సిబ్బంది నుంచి మీడియాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. దాదాపు 43 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని సాక్షాత్తు జిల్లా ఎన్నికల అధికారే ప్రకటించారు. వారందరికీ నియామక ఉత్తర్వుల సమయంలోనే పోస్టల్‌ బ్యాలెట్లు జారీ చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. కనీసం శిక్షణ సమయంలో వాటిని అందజేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. ఏప్రిల్‌ 7వ తేదీ సాయంత్రం ఐదుగంటల్లోగా ఫారం–12 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికే పోస్టల్‌ బ్యాలెట్లు జారీ చేశామని అధికారులు చెబుతున్నారు.

కొనసాగుతున్న ప్రలోభాలు
మరో వైపు పోస్టల్‌ బ్యాలెట్లు జారీలో కావాలనే జాప్యం జరిగినట్టు అర్ధమవుతోంది. ఏడో  తేదీన అందిన దరఖాస్తుల మేరకు పోస్టల్‌ బ్యాలెట్లు జారీ చేసినా రెండు మూడు రోజుల్లోనే సిబ్బందికి చేరాలి. కానీ నేటికీ సగం మందికి చేరలేదని చెబుతున్నారు. మరో వైపు పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో అధికార పార్టీకి కొంతమంది అధికారులు అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. చిరునామాలు, ఫోన్‌ నెంబర్లతో సహా పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ చేసిన సిబ్బంది పూర్తి వివరాలు అధికార పార్టీ నేతలకు చేరవేస్తున్నారని తెలిసింది.  అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయాలని ఒత్తిళ్లు కూడా తీసుకొస్తున్నట్టుగా సమాచారం. ఓ కీలకాధికారి స్వయంగా ఈ తరహా ప్రచారం కూడా సాగిస్తున్నట్టు  సిబ్బంది చెబుతున్నారు. మరో వైపు పోస్టల్‌ బ్యాలెట్‌ చేరగానే అధికార పార్టీ నేతలు తమ అనుచరులను వారి ఇళ్లకు, కార్యాలయాలకు పంపించి బేరసారాలు సాగిస్తున్నారు. ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు ముట్టజెబుతున్నట్టు తెలిసింది. కొన్ని చోట్ల పేటీఎం, ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ సిస్టమ్స్‌ ద్వారా ఓట్ల కొనుగోలుకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరికొంతమందికి పదోన్నతులు కల్పిస్తాం.. మీపై ఉన్న కేసులు ఎత్తి వేయిస్తాం అంటూ ఎర వేయడమే కాదు సంబంధిత శాఖల ఉన్నతాధికారుల ద్వారా ఫోన్లు కూడా చేయిస్తున్నట్టు  తెలిసింది. అయితే మెజార్టీ ఉద్యోగులు ఈ ప్రలోభాలను తిప్పికొడు తున్నట్టు తెలిసింది. దాదాపు పాతికవేలకు పైగా పోస్టల్‌ బ్యాలెట్లు ఉండడంతో సాధ్యమైనన్ని ఓట్లు తమకు అనుకూలంగా తిప్పుకునేందుకు అధికార పార్టీ నేతలు విఫలయత్నాలు చేస్తున్నారు.

సిబ్బందికి..  బ్యాలెట్లకు పొంతనలేదు
అధికారికంగా 28,451 మందికి పోస్టల్‌ బ్యాలెట్లు జారీ చేశామని చెబుతున్నారు. అదే స్థాయిలో లోక్‌సభ బ్యాలెట్లు కూడా జారీచేయాల్సి ఉన్నప్పటికీ 27,168 మందికి మాత్రమే లోక్‌సభ బ్యాలెట్లు జారీ చేశారు. నియోజకవర్గాల్లో పోలింగ్‌ స్టేషన్ల సంఖ్యను బట్టి పోలింగ్‌ సిబ్బంది ఉంటారు కాబట్టి హెచ్చు తగ్గులుండడంలో తప్పులేదు. కానీ మెజార్టీ నియోజకవర్గాల్లో రెండు వేలకు మించి పోస్టల్‌ బ్యాలెట్లు జారీ కానీ పరిస్థితి నెలకొంది. దాదాపు 15 వేల మందికి పైగా పోలీస్‌ సిబ్బందిని వినియోగిస్తున్నట్టు ప్రకటించిన ఎన్నికల అధికారులు వారికి జారీ చేసిన పోస్టల్‌ బ్యాలెట్లు మాత్రం 4,600 మాత్రమే. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొన్న 1306 ఆర్టీసీ సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్లు జారీ చేశారు. మరో వైపు 7వ తేదీ సాయంత్రం ఐదు గంటల తర్వాత ఫారం–12 అందాయన్న సాకుతో సుమారు 4,500 మందికి పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ చేయలేదంటున్నారు. కానీ తామంతా నిర్ణీత గడువులోగానే ఫారం–12  సమర్పించామని, కావాలనే పోస్టల్‌ బ్యాలెట్లు జారీచేయలేదని కొందరు చెబుతున్నారు. ఇక 8వ తేదీన శిక్షణలో పాల్గొన్న సుమారు 550 మంది ఆశ వర్కర్లకు కూడా పోస్టల్‌ బ్యాలెట్లు అందలేదు. ఎన్నికల అధికారులు, సిబ్బంది కోసం సుమారు 400కి పైగా ప్రైవేటు వాహనాలు వినియోగించారు. ఈ వాహనాలపై పనిచేసిన డ్రైవర్లు, క్లీనర్లు సుమారు 800 మంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు.   ఎంతమంది పోస్టల్‌ బ్యాలెట్లు వినియోగించుకున్నదీ చెప్పలేని దుస్థితి నెలకొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top