పచ్చచొక్కాల జేబులు నింపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఇసుక విధానం, నీరు-చెట్టు కార్యక్రమాలను అమలు
మండపేట :పచ్చచొక్కాల జేబులు నింపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఇసుక విధానం, నీరు-చెట్టు కార్యక్రమాలను అమలు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ఈ సోమవారం మండపేట వచ్చిన ఆయన స్థానిక కామత్ ఆర్కేడ్‌లో విలేకర్లతో మాట్లాడారు. డ్వాక్రా మహిళల పేరిట ఇప్పటికే కోట్లాది రూపాయల ఇసుక దందా సాగిస్తున్న అధికార పార్టీ నాయకులు, రైతుల పేరిట నీరు-చెట్టు పథకంలోనూ ప్రజాధనం కొల్లగొడుతున్నారన్నారు. ప్రజా సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, బడ్జెట్‌లో చేసిన అరకొర కేటాయింపులే ఇందుకు నిదర్శనమని అన్నారు.
1.30 లక్షల రేషన్ కార్డులకు పూర్తిస్థాయిలో సరుకులు ఇవ్వలేని దుస్థితి నెలకొందని విమర్శించారు. ప్రాంతీయ, సామాజిక సమతుల్యతే ప్రామాణికంగా వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటీలు ఏర్పాటు చేశామని జ్యోతుల అన్నారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల నుంచి పూర్తిస్థాయిలో పార్టీ జిల్లా ప్రధాన కమిటీ ఏర్పాటు చేశామని, ఇందులోకి మండపేట, రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, రాజోలు నియోజకవర్గాల నుంచి త్వరలో ప్రతినిధులను తీసుకుంటామని తెలిపారు.
పార్టీ సీజీసీ సభ్యులు కుడిపూడి చిట్టబ్బాయి, రాజమండ్రి రూరల్, పి.గన్నవరం కో ఆర్డినేటర్లు గిరజాల వెంకటస్వామినాయుడు, కొండేటి చిట్టిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, నక్కా రాజుబాబు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరజాల బాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు శెట్టిబత్తుల రాజుబాబు, అత్తిలి సీతారామస్వామి, సీనియర్ నాయకుడు మట్టపర్తి నాగేంద్ర పాల్గొన్నారు.జగ్గంపేట : పార్టీ జిల్లా కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన సందర్భంగా శెట్టిబత్తుల రాజబాబు, అత్తిలి సీతారామస్వామి ఇర్రిపాకలో జ్యోతుల నెహ్రూను కలిశారు.