‘తెలుగు రాష్ట్రాల్లో అద్భుత జ్యోతిష్య విజ్ఞానం’

Swaroopanandendra Saraswati Said Amazing Astrology In Telugu States - Sakshi

స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి

సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అద్భుతమైన జ్యోతిష్య విజ్ఞానం ఉందని, ఇది దేశవ్యాప్తం కావాలన్నదే ఆకాంక్ష అని శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేదాలు ఎంత గొప్పవో ప్రపంచానికి తెలియకపోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశంలో వేదం స్వరాలతో ఆగిపోయిందన్నారు. వేదం భాష్యం చెప్పుకునే వాళ్ళు, సంస్కృత పరిజ్ఞానం ఉన్నవాళ్లు, చందస్సు తెలిసినవాళ్ళు తగ్గిపోతున్న సమయంలో వేదం గొప్పతనం ప్రపంచంలో తగ్గిపోతోందన్నారు. ‘నేటికి కూడా జ్యోతిష్యం పేరుతో నక్షత్ర , భూ మండలం రెండింటి గురించి దశ దిశ నిర్ధేశం చేసి లక్షల కోట్లు ఖర్చు చేసి గ్రహణం ఎప్పుడు వస్తుందో విదేశాల్లో వెతుకుతారని.. ఓ సామాన్య వస్త్రధారణతో గ్రహణం గురించి చెప్పే దేశం ఏకైక దేశం భారతదేశం’ అని అన్నారు. రూపం లేని కాలానికి కొలత చంద్రమానం, సౌరమానం, మంత్రదష్టలు, రుషులు అందించిన అద్భుత సంపద మన జ్యోతిష్కులని అన్నారు. రూపం లేని కాలానికి ఎప్పుడు ఏమి జరుగుతుంది, గ్రహాల కలయిక, పరిణామాలు ఎలా ఉంటాయనే వివరాలు కేవలం 15, 20 రూపాయలతో దొరికే పంచాంగంలో నిక్షిప్తం చేసే జ్ఞానులు జ్యోతిష్కులని కొనియాడారు.

భారత దేశం జ్యోతిష్కులు రుణం తీర్చుకోలేదన్నారు. జ్యోతిష్యం లేకపోతే సొంత కర్మలు, అగ్నిహోత్ర కర్మలు కూడా జరగవన్నారు. అగ్నిహోత్ర, వైదిక కర్మలకు జ్యోతిష్యమే ప్రధానమన్నారు. జ్యోతిష్యం అనేది సార్వత్రిక అనుభవం అని పేర్కొన్నారు. జ్యోతిష్యం పై ప్రభుత్వం ముందుకు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల జ్యోతిష్కులతో సమావేశం ఏర్పాటు చేసిందన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ, టీటీడీ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఉగాది తర్వాత ఏర్పాటు చేయాలనే సంకల్పం ఉందని, అందుకు ప్రారంభ సూచకంగా సింహాద్రి అప్పన్న సన్నిధిలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఏర్పాటు చేసిందన్నారు. పండగల తిథుల్లో వచ్చే చిచ్చును మధ్యలో కొందరు నాస్తికులు అవహేళన చేస్తున్నారన్నారు. మీడియా చర్చల్లో నాస్తికుల అవహేళనకు సరైన వివరణ ఇవ్వలేని జ్యోతిష్యులు పాల్గొంటే జ్యోతిష్య శాస్త్రం శక్తి తగ్గిపోతుందన్నారు. కొత్త పంచాంగం రూపకల్పనలో రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు వచ్చేలా జ్యోతిష్యులు సహకరించాలని కోరారు. 

ఇతర దేశాలకు మార్గనిర్దేశనం: స్వాత్మానందేంద్ర
మన దేశం ఇతర దేశాలకు గురుస్థానంలో ఉందని శారద పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర అన్నారు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, నదులు, తీర్థాలు, విజ్ఞాన సంపదతో ఇతర దేశాలకు మనం దేశం మార్గ నిర్దేశనం చేస్తోందన్నారు. వేదాలు, వేదంగాల్లో జ్యోతిష్యం గొప్పదన్నారు. మన దేశమే కాదని, ఇతర దేశాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పరికరాలతో గ్రహస్థితులను తెలుసుకుని బయటకు వెల్లడిస్తారని.. కానీ పంచాంగకర్తలు మారుమూల గ్రామాల్లో, పట్టణాల్లో, చెట్ల కింద వేదంతో కూడిన గణిత శాస్త్రంతో అధ్యయనం చేసి సూర్య, చంద్ర గ్రహణాలు, గ్రహ స్థితిగతులను పంచాంగంలో పొందుపరుస్తారన్నారు. పంచాంగ రూపకర్తలు చెప్పినది నూటికి నూరు శాతం నిజమవుతున్నాయన్నది ప్రత్యక్ష అనుభవం అని తెలిపారు. సూక్ష్మమైన అంశాలను కూడా క్షుణ్ణంగా బాహ్య ప్రపంచానికి అందించే జ్యోతిష్యులు, పంచాంగ కర్తలు ఉండటం అందరి అదృష్టం అని స్వామి స్వాత్మానందేంద్ర పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top