కుంగుబాటులో టీనేజీ

Surveys make it clear that children are experiencing psychological problems due to Corona and Lockdown - Sakshi

నాలుగైదు నెలలుగా ఇళ్లకే పరిమితమై ఉండటమే కారణం

సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు, టీవీలకు అతుక్కుపోయిన వైనం 

పబ్జీ గేమ్‌లు, అవాంఛిత వెబ్‌సైట్లతో ప్రవర్తనలో మార్పులు 

ఉద్యోగ, అవకాశాలు కోల్పోతామని ‘ఉన్నత’ విద్యార్థుల్లో ఆందోళన 

తల్లిదండ్రులు సరైన మార్గనిర్దేశం చేయాలంటున్న వైద్యనిపుణులు

సాక్షి, అమరావతి: కరోనా, లాక్‌డౌన్‌ వల్ల మన దేశంలో లక్షల మంది పిల్లలు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. గత నాలుగైదు నెలలుగా విద్యాసంస్థలు మూతపడి ఉండడం పిల్లల మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. ముఖ్యంగా పాఠశాల స్థాయి పిల్లల్లో, టీనేజ్‌ వయసున్న 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల్లో తీవ్ర మానసిక సమస్యలకు దారితీస్తున్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. డిగ్రీ ఆ పై చదివే విద్యార్థుల్లో భవిష్యత్‌పై భయాందోళనలు నెలకొంటున్నట్లు చెబుతున్నాయి. తమకు సిలబస్‌ పూర్తికాకపోవడం, పరీక్షలు జరగకపోవడంతో వారంతా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతామన్న భయాందోళనలతో ఉన్నారని అంటున్నాయి.

ఆహారపు అలవాట్లలో తేడాతో ఊబకాయం
► గతంలో స్కూళ్లు ఉండేటప్పుడు పిల్లలు నిర్ణీత సమయంలో ఆహారాన్ని స్వీకరించేవారు. ఇప్పుడు ఇళ్లలోనే ఉండడంతో జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తింటున్నారు. ఆటలు, శారీరక శ్రమ లేక ఊబకాయానికి లోనవుతున్నారు.  
► పెద్ద పిల్లలు పూర్తిగా టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లకే అతుక్కుపోయి ఉంటుండటం వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తోంది.
► త్వరగా పడుకొని ఉదయాన్నే లేచే అలవాటు పూర్తిగా మారిపోయింది. రాత్రి 12 వరకు సెల్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తూ తిరిగి ఉదయం 10 తర్వాత నిద్ర లేస్తున్నారు. 

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అడిక్ట్‌..
► స్కూళ్లు లేకపోవడంతో పిల్లలు సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లలో పబ్జీ, ఇతర ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అడిక్ట్‌ అవుతున్నారు. 
► చదువులపై ఆసక్తి తగ్గింది. బయటకు వెళ్లవ ద్దంటున్న తల్లిదండ్రులపై ఎదురుతిరుగుతున్నారు. వారిలో భావోద్రేకాలు పెరిగిపోతున్నాయి. 
► ముఖ్యంగా 13, 14 ఏళ్ల పిల్లలు అయితే అమ్మాయిలతో చాటింగ్‌ చేయడం, అవాంఛిత వెబ్‌సైట్‌లను చూడటం వంటివాటితో పెడదారి పడుతున్నారు.
► ఉద్వేగపూరిత మార్పులతో మానసిక కుంగుబాటుకు, ఆందోళనకు లోనవుతున్నారు. 
► విద్యాసంవత్సరంలో చాలా వ్యవధి వచ్చి నందున పిల్లల్లో గతంలో నేర్చుకున్న నైపు ణ్యాలు మరుగున పడిపోతున్నాయని, తదు పరి తరగతుల్లో వారు దీనివల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశముందని ఉపాధ్యాయ సం ఘాలు అంటున్నాయి. యుక్త వయసు పిల్లల్లో తల్లిదండ్రులకు ఎదురుతిరగడం, ప్రతి దానికి మానసికంగా కుంగిపోవడం, ఎమోషనల్‌ స్ట్రెస్‌ వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.

ఆందోళన వద్దు
కరోనా వల్ల ఉద్యోగాలు రావేమోనన్న ఆందోళన వద్దు. విద్యార్థులను ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక ప్రత్యా మ్నాయ చర్యలు తీసుకుంటోంది. కరోనాతో నష్టపోతున్న కాలాన్ని భర్తీ చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూసేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
– ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి

స్కూళ్లు తెరవడం ద్వారానే... 
జాగ్రత్తలు పాటిస్తూ స్కూళ్లు, కాలేజీలు తెరవడం ద్వారానే పిల్లల మానసిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పిల్లల్లో  రోగనిరోధక శక్తి అంతగా ఉండదు. ఐరన్, జింక్, విటమిన్ల లోపం పిల్లలను వెన్నాడుతోంది.  
– డాక్టర్‌ ఆర్‌ వెంకట్రాముడు, సైకియాట్రీ ప్రొఫెసర్, రిమ్స్‌ మెడికల్‌ కాలేజీ, కడప

పిల్లలతో ఎక్కువ సేపు గడపాలి
పిల్లలు ఇళ్లలోనే ఉండిపోవడంతో వారిలో మానసిక సమస్యలు ఏర్పడుతున్నాయి.  తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సేపు గడుపుతూ ఉండేలా చూసుకోవాలి. 
– డాక్టర్‌ ఇండ్ల విశాల్‌ రెడ్డి, చిన్న పిల్లల వైద్యనిపుణులు, విజయవాడ

చురుకుదనం తగ్గింది
మా పాప కేజీబీవీలో ఇంటర్‌ చదివి మంచి మార్కులు తెచ్చు కుంది. స్కూల్‌లో పిల్లలు, టీచర్లతో చురుగ్గా ఉండేది. కరోనా వల్ల ఇంటి దగ్గరే ఉండిపోవడంతో ఇప్పుడు ఆ చురుకుదనం తగ్గింది. 
– కేజీబీవీ విద్యార్థిని రమణి తల్లి నందపు వరలక్ష్మి, కనపాక, విజయనగరం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top