ఎన్నాళ్లీ కష్టాలు..! | Still how many days Difficulties | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ కష్టాలు..!

Jan 29 2014 3:27 AM | Updated on Sep 19 2018 8:32 PM

జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి కింద మెయిన్ 3,476, మినీ 58 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి.

కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి కింద మెయిన్ 3,476, మినీ 58 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రతి కేంద్రంలో ఒక అంగన్‌వాడీ వర్కర్, ఒక ఆయా పనిచేస్తున్నారు. జిల్లా మొత్తంగా ఆరేళ్లలోపు పిల్లలు 3,70,889 మంది అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి.
 
 పిల్లలతో పాటు గర్భిణి, బాలింతల సంఖ్య ఆయా కేంద్రాల పరిధిలో 93,555 మంది ఉన్నారు. వీటిలో పనిచేసే అంగన్‌వాడీ వర్కర్లకు రూ.3,750, ఆయాలకు రూ.1900 జీతం ఇస్తున్నారు. ఏడు ప్రాజెక్టుల్లో అమృతహస్తం పథకం కొనసాగుతోంది. ఇందులో సాధారణ విధులతో పాటు పిల్లలకు భోజనం కూడా వండి పెట్టాల్సి  బాధ్యత ఆయాలది.  ఈ మేరకు ఇక్కడి అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.4,200లు, ఆయాలకు రూ.2,150లు వేతనం అందిస్తున్నారు.
 
 ఇవీ సమస్యలు
 అంగన్‌వాడీ వర్కర్లకు జీతాన్ని రూ.12,500లకు పెంచాలని  డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని ఏళ్లుగా పనిచేసినా వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపులేదు. ఇందిరమ్మ అమృతహస్తం పథకంలో భాగంగా ఆయాలే వంట చేస్తున్నారు. వీరికి నెలకు రూ.250లు అదనంగా జీతంతో కలిపి ఇస్తారు. వీటితో పాటు వర్కర్ల టీఏ, డీఏ బిల్లులను మూడు, నాలుగు నెలలకు ఒకసారి చెల్లిస్తున్నారు.  అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దెలను మండల కేంద్రాల్లో రూ.750, పట్టణ ప్రాంతాల్లో రూ.3వేలు పెంచారు. కానీ ఈ మొత్తం ఇచ్చేందుకు ప్రభుత్వం అనేక షరతులను పెట్టింది. ఈ షరతులు తీర్చే ఇల్లు వెతుక్కులేక, ఇంటి అద్దెను చెల్లించలేక వర్కర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  సాధారణ విధులే గాకుండా ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం వీరి సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ కారణంగా వారిపై తీవ్రంగా పనిభారం పెరుగుతోంది.
 
 జిల్లాలో ఇదీ అంగన్‌వాడీల పరిస్థితి
  ఆదోనిలో రెండు నెలలుగా అంగన్ వాడీ  వర్కర్లకు వేతనాలు అందడం లేదు.
  ఆళ్లగడ్డలో ప్రతి నెలా 1వతేదీన గుడ్డు సరఫరా చేయాల్సి ఉన్నా 10 వతేదీ వరకు సరఫరా చేయడం లేదు.
 
  నంద్యాల మండలంలోని అయ్యలూరు 2వ అంగన్‌వాడీ కేంద్రంలో పాడుబడ్డ ఇంటిలో కేంద్రం నిర్వహణ సాగుతోంది.
 
  చిప్పగిరి మండలంలో 28 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో పనిచేస్తున్న కార్యకర్తలు, ఆయాలకు ప్రతినెలా వేతనాలు అందడం లేదు. ప్రస్తుతం 28 కేంద్రాల్లో 20 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండడంతో కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  హోళగుంద మండలంలో మొత్తం 45 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 45 మంది ఆయాలు ఉన్నారు. వీరికి ప్రభుత్వం గతంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే కేంద్రాలను నిర్వహించేలా బాధ్యతలు అప్పజెప్పింది. ఇటీవల ఆ కేంద్రాల సమయవేళలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెంచింది. దీంతో పనిభారం ఎక్కువై అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
  దేవనకొండ మండలంలో మొత్తం 68 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 68 మంది ఆయాలు ఉన్నారు. ప్రస్తుతం 18 కేంద్రాలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. ఆస్పరి మండలంలోని 56 కేంద్రాల్లో  13 కేంద్రాలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. ఉదయం మొదలు సాయంత్రం వరకు కేంద్రాలకు వచ్చే చిన్నారులను వారు కంటికి రెప్పలా కాపాడుతున్న తమకు కష్టానికి తగిన ఫలితం లభించడం లేదని అంగన్‌వాడీ వర్కర్లు తెలుపుతున్నారు.  
 
  హాలహర్వి మండలంలో 37 కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 8 భవనాలకు మాత్రమే సొంత గదులు ఉన్నాయి. మిగిలినవన్నీ అద్దె భవనాల్లో, ఇరుకు గదుల్లో కొనసాగుతున్నాయి.
  శ్రీశైలం నియోజకవర్గంలో అంగన్‌వాడీ వర్కర్ల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది.  అమృత హస్తం పథకం కింద తల్లులకు, గర్భిణిలకు పౌష్టికాహారాన్ని వండి పెడుతున్నా.. నెలకు వారికి అదనంగా అందే వేతనం రూ.250లు మాత్రమే.
 
  బనగానపల్లె  మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ బిల్లు మంజూరు కావడం లేదు. దీంతో కార్యకర్తలే ఈ బిల్లు భరిస్తున్నారు. గ్యాస్ సరఫరా లేన్నందున వంట చేసేందుకు, కట్టల కొనుగోలుకు అందించే మొత్తం ఏమాత్రం చాలడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు.
  పత్తికొండ  మండలంలో 56 సెంటర్లలో 45 సొంతభవనాలు ఉండగా వీటిలో 14 శిథిలమయ్యాయి.
 
  మద్దికెర మండలంలో 39 సెంటర్లలో 78 మంది వర్కర్లు, ఆయాలు సేవలు అందిస్తున్నారు. అంగన్‌వాడీవర్కర్లకు రెండు నెలలు నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
  వెల్దుర్తి మండలంలో 63 సెంటర్లలో 38 అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి. స్థానిక నాయకులు బెదిరింపులు, దళారుల బెడదతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement