డిసెంబర్‌ 20లోగా తేల్చండి

State Election Commission letter to State Govt - Sakshi

‘పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల’పై సర్కారుకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ

హైకోర్టు తీర్పు మేరకు జనవరి 21లోగా ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉందని వెల్లడి

ప్రభుత్వం రిజర్వేషన్లు తేల్చితే ఎన్నికలు నిర్వహించగలమని స్పష్టీకరణ 

హైకోర్టు తీర్పు అమలుకు సహకరించాలని సూచన 

సాక్షి, అమరావతి: హైకోర్టు తీర్పు మేరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణకుగానూ డిసెంబర్‌ 20వ తేదీలోగా పంచాయతీలవారీగా రిజర్వేషన్లను తేల్చి, ఆ జాబితాను తమకు పంపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ తాజాగా పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి, డైరక్టర్లకు లేఖలు రాశారు. ఈ ఏడాది ఆగస్టు ఒకటవ తేదీ నాటికే రాష్ట్రంలో ఉన్న దాదాపు 13 వేల గ్రామపంచాయతీల సర్పంచుల పదవీకాలం ముగిసింది. దాంతో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసినప్పటికీ.. అప్పట్లో రిజర్వేషన్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం తేల్చలేదు. దీంతో ఎన్నికలు పూర్తిగా వాయిదా పడ్డాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం సర్పంచుల స్థానంలో గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించగా.. దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు తీర్పు చెబుతూ.. గ్రామపంచాయతీలకు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పదిరోజుల క్రితం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. హైకోర్టు తీర్పు మేరకు జనవరి 22లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కనీసం జనవరి 21 నాటికైనా తాము పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని, ఇందుకుగాను రాష్ట్ర సర్కారు సహకారం అందించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రెండురోజులక్రితం ప్రభుత్వానికి లేఖ రాశారు.

రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియ తేల్చిన తరువాత ఎన్నికల నిర్వహణకు 45 రోజుల సమయం అవసరమవుతుందని, ఇందుకుగాను డిసెంబర్‌ 20వ తేదీ నాటికల్లా ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను తేల్చి, జిల్లాలవారీగా జాబితాలను తమకు అందజేయాలని లేఖలో కోరారు. కాగా, ఈ లేఖపై సీఎం చంద్రబాబు తీసుకునే రాజకీయ నిర్ణయం ఆధారంగానే తాము తదుపరి చర్యలు మొదలు పెడతామని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top