పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ర్ట విభజన కొత్త సమస్యను తెచ్చిపెడుతోంది.
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ర్ట విభజన కొత్త సమస్యను తెచ్చిపెడుతోంది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 15 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. వెంటనే ఫలితాలు ప్రకటించి, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. జూన్ 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లో భాగంగా జూన్ 2 అపాయింటెడ్ డే నాటికే పాఠశాల విద్యా డైరె క్టరేట్‌ను రెండుగా చేయడంతోపాటు పరీక్షల విభాగాన్నీ విభజించాలని ఆదేశాలున్నాయి. ఈ క్రమంలో జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాలు, రెండు పరీక్షల విభాగాలు ఏర్పాటవుతాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా... సమైక్య రాష్ట్రంలో వార్షిక పరీక్షలను నిర్వహించి, ఆంధ్రప్రదేశ్ పేరుతో విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇస్తారు. మరి వేర్వేరు రాష్ట్రాలు ఏర్పడిన తరువాత అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఎవరు నిర్వహించాలి? నిర్వహణ ఏదో ఒక ప్రభుత్వం చేపట్టినా.. విద్యార్థులకు ఏ రాష్ట్రం పేరుతో సర్టిఫికెట్లను జారీ చేయాలన్న గందరగోళం నెలకొంది. దాదాపు 2.50 లక్షల మంది విద్యార్థుల విషయంలో ఈ సమస్య ఎదురుకానుంది.
బోర్డు ఉంటే బాగుండేది: ప్రస్తుతం రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు బోర్డు లేదు. ఎస్‌ఎస్‌సీ (సెకండరీ స్కూల్ సర్టిఫికెట్) బోర్డు ఉండాల్సిన స్థానంలో ప్రభుత్వ పరీక్షల నిర్వహణ విభాగం వీటిని చూసుకుంటోంది. సాధారణంగా దేశంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అటానమస్ బోర్డులు ఉంటాయి. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం పదో షెడ్యూల్‌లో కార్పొరేషన్లు, సొసైటీలు, బోర్డులను చేర్చారు. ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రభుత్వ శాఖలో భాగంగా ఉండడంతో ఈ అంశాన్ని బిల్లులో చేర్చలేదు. అందువల్ల రాష్ట్ర విభజన తర్వాత ఏడాది వరకు ఉమ్మడిగా సేవలు అందించే అవకాశం లేకుండా పోయింది. 1976 వరకు ఈ విభాగంలో ఉండి విడిపోయిన ఇంటర్ బోర్టు అటానమస్‌గా ఏర్పాటయ్యింది. కానీ, ఎస్‌ఎస్‌సీ బోర్డును పునరుద్ధరించకపోవడంతో సమస్య వచ్చిపడింది.