కౌలు రైతుల కష్టాలు గట్టెక్కినట్లే | State Cabinet Approves Draft Bill To Help Tenant Farmers | Sakshi
Sakshi News home page

కౌలు రైతుల కష్టాలు గట్టెక్కినట్లే

Jul 20 2019 9:06 AM | Updated on Jul 20 2019 9:06 AM

State Cabinet Approves Draft Bill To Help Tenant Farmers - Sakshi

సాక్షి, కడప సెవెన్‌రోడ్స్‌ :  కౌలు రైతులకు అన్ని రకాల సాయం అందేందుకు వీలుగా రాష్ట్ర మంత్రివర్గం ముసాయిదా బిల్లు ఆమోదించడంతో ఇక కౌలు రైతుల కష్టాలు తీరినట్లేనని చెప్పవచ్చు. తాము అధికారంలోకి వస్తే కౌలు దారుల రక్షణకు చట్టబద్దమైన భరోసా కల్పిస్తామని వైఎస్సార్‌ సీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ దిశగా ప్రస్తుత చట్టానికి సవరణలు తీసుకొస్తున్నారు. దీంతో పలు ప్రభుత్వ రాయితీలు తమకు దక్కనుండడంతో జిల్లాలోని కౌలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ఆధీకృత రైతుల చట్టం–2011తీసుకొచ్చారు. అయితే ఈ చట్టంలో ఉన్న అనేక లొసుగుల కారణంగా అమలులో ఆశించిన ఫలితాలు సాధ్యం కాలేదు. ప్రధానంగా భూమిని కౌలుకు ఇస్తున్నట్లు యజమానులు రాతపూర్వకంగా ఇచ్చేందుకు అంగీకరించలేదు.

యజమాని మౌఖిక అంగీకారంతో రెవెన్యూ గ్రామ సభల ద్వారా కౌలుదారులను గుర్తించి రుణ అర్హతకార్డులు (ఎల్‌ఈసీలు) పంపిణీ చేస్తున్నారు. ఎల్‌ఈసీ కాలపరిమితి జూన్‌ 1 నుంచి మే 31వ తేది వరకు ఉంటుంది.  కౌలుదారులు భూమిపై హక్కును క్లెయిమ్‌ చేసుకోవడానికి లేదా సమర్పించుకోవడానికి రుణ అర్హత కార్డు సాక్ష్యంగా ఉపయోగించరాదని చట్టంలో పొందుపరిచారు. అలాగే అడంగల్‌లో అనుభవం దారునిగా కూడా కౌలుదారు పేరును నమోదు చేయరు. కౌలుదారులకు ఎల్‌ఈసీల ద్వారా ఇచ్చే రుణం కేవలం పంటపై మాత్రమేనని, భూమిపై కాదని ప్రభుత్వం ఆ చట్టంలో స్పష్టంగా పేర్కొంది. భూ యజమానులకు ఇన్ని రక్షణలు కల్పించినప్పటికీ కౌలుదారుల కంటే ముందే బ్యాంకులకు వెళ్లి పంట రుణాలు పొందుతున్నారు. ఇందువల్ల కౌలుదారులకు పంట రుణాలు, బీమా, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ తదితర ప్రభుత్వ రాయితీలు అందకుండా పోయాయి.

జిల్లాలో సుమారు లక్ష మంది వరకు కౌలు రైతులు ఉంటారని అనధికార అంచనాలు చెబుతున్నాయి. అయితే ఏనాడూ రెవెన్యూ గ్రామసభల ద్వారా 15 వేలకు మించి కౌలు రైతులను గుర్తించలేదు. కౌలు రైతులకు ఇచ్చిన ఎల్‌ఈసీలు, వారికి అందిన పంట రుణాల గణాంకాలను పరిశీలిస్తే ఈ చట్టం ఎంత అధ్వాన్నంగా అమలు జరుగుతుందో అర్థమవుతుంది. గత సంవత్సరం సుమారు 12 వేల మందికి రుణ అర్హత కార్డులు మంజూరు చేయగా, అందులో 883 మందికి వివిధ బ్యాంకుల ద్వారా 10.17 కోట్ల రూపాయల పంట రుణాలు అందాయి. ఈ సంవత్సరం జూన్‌ ఆఖరు వరకు 322 మంది కౌలు రైతులకు 2.93 కోట్ల రూపాయలు పంట రుణాలు ఇచ్చారు. 2011లో ఏపీ ఆధీకృత రైతుల చట్టం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాక జిల్లాలో సుమారు 15 వేల మంది రైతులకు పంట రుణాలు అందాయని బ్యాంకర్లే స్పష్టం చేస్తున్నారు.

ఇక ఏటా పెట్టుబడి  సాయం...
రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించిన ముసాయిదా బిల్లు చట్ట రూపం దాలిస్తే కౌలు రైతులు 11 నెలలపాటు చెల్లుబాటు అయ్యేలా భూ యజమానులతో సాగు ఒప్పంద పత్రాలు రాసుకునేందుకు వీలుంటుంది. ఇందువల్ల కౌలు రైతులకు అనేక ప్రభుత్వ రాయితీలు అందనున్నాయి. ఒప్పంద పత్రాలు కలిగిన కౌలు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం యేటా అందించే రూ. 12,500 పెట్టుబడి సాయం అందుతుంది. దీంతోపాటు ఉచిత పంటల బీమా, పంట రుణం, ఇన్‌ఫుట్‌సబ్సిడీ తదితర రాయితీలన్నీ దక్కనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement