హర్ గండం గడిచింది. తుపాను దిశను మార్చుకొని తీరం దాటడంతో జిల్లాకు ఎటువంటి నష్టం కలగలేదు. మూడు రోజుల పాటు కలవరపెట్టిన తుపాను ఎటువంటి ప్రభావం చూపకపోవడంతో ప్రజానీకం,
=దిశ మార్చుకొని తీరం దాటిన లెహర్
=జిల్లాకు తప్పిన ముప్పు
=ఊపిరిపీల్చుకున్న ప్రజలు, అధికారులు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: లెహర్ గండం గడిచింది. తుపాను దిశను మార్చుకొని తీరం దాటడంతో జిల్లాకు ఎటువంటి నష్టం కలగలేదు. మూడు రోజుల పాటు కలవరపెట్టిన తుపాను ఎటువంటి ప్రభావం చూపకపోవడంతో ప్రజానీకం, జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. లెహర్ తుపాను హెచ్చరికలు వచ్చిన నాటి నుంచి తీర ప్రాంత గ్రామాలకు కంటి మీద కునుకులేకుండాపోయింది. భారత వాతావరణ నిపుణులతో పాటు అమెరికా, ఇతర దేశాల శాస్త్రవేత్తలు కూడా లెహర్ తుపాను అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.
దీనికి తోడు ఇది తీవ్ర తుపానుగా మారి ముందు కాకినాడ తీరం దిశగా రావడంతో జిల్లాపై తీవ్ర ప్రభావం ఉంటుందని అధికారులు భావించారు. దీంతో జిల్లా యంత్రాంగం పరుగులు పెట్టింది. మునుపెన్నడూ లేని విధంగా ముందస్తు చర్యలు చేపట్టింది. ఆర్మీ, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఫైర్‌మన్ బృందాలను సహాయక చర్యల కోసం రంగంలోకి దింపింది. అత్యవసర పరిస్థితుల కోసం రెండు హెలికాప్టర్లను కూడా సిద్ధం చేసింది.
ఊపిరి పీల్చుకున్న అధికారులు : భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్న హెచ్చరికలతో జిల్లాలో తీర, లోతట్లు ప్రాంతాల నుంచి 40 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 76 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. గురువారం తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు పడతాయని భావించిన అధికారులు బుధవారం సాయంత్రం అచ్యుతాపురం మండలంలో 1500 మందిని, రాంబిల్లిలో 1250 మందిని, నక్కపల్లిలో 2600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
కానీ గురువారం తెల్లవారుజామున కాస్త మేఘాలు కమ్ముకున్నప్పటికీ కొంత సేపటికి ఎండ వచ్చింది. దీంతో కేంద్రాల్లో ఉన్న వారంతా తిరిగి వారి నివాసాలకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై ఉన్నా వర్షం పడలేదు. చల్లటి గాలులు కొంత కలవరపెట్టాయి. కాకినాడ వద్ద తీరం దాటుతుందని నిపుణులు అంచనా వేసినా తుపాను దిశను మార్చుకొని మధ్యాహ్నం 2 గంటలకు మచిలీపట్నం సమీపంలో తీరం దాటింది. ఆ ప్రభావం జిల్లాపై పడలేదు. దీంతో అధికారులు పునరావాస కేంద్రాలను మూసివేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కటక్‌కు వెళ్లిపోయాయి. మండలాల్లో మకాం వేసిన జిల్లా అధికారులు, మండల ప్రత్యేకాధికారులు వెనక్కి వచ్చేశారు.