శ్రీధర్‌బాబు శాఖ మారింది

శ్రీధర్‌బాబు శాఖ మారింది - Sakshi




శైలజానాథ్‌కు శాసనసభ వ్యవహారాల శాఖ 


కేబినెట్‌లో ఆకస్మిక మార్పులు చేసిన కిరణ్

 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ డాక్టర్ శైలజానాథ్‌కు శాసనసభ వ్యవహారాలను అదనంగా అప్పగించారు. ఇప్పటివరకు ఈ శాఖను చూస్తున్న పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు వాణిజ్య పన్నుల శాఖను అదనంగా కట్టబెట్టారు. కొత్తగా ఏర్పాటు చేసిన భాషా, సాంస్కృతిక శాఖను పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్‌కు కేటాయించారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఆయా శాఖల మార్పులు చేర్పులకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి రాత్రి 10.30 గంటలకు ఉత్తర్వులు జారీ చేశారు.

 

 

 ఇటీవల అసెంబ్లీ సమావేశాల ప్రొరోగ్ అంశంతో పాటు, రాష్ట్ర విభజన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే అంశంలో.. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబుకు, ముఖ్యమంత్రి కిరణ్‌కు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలను ప్రొరోగ్ చేయాలని సీఎం పట్టుపట్టినా.. సంబంధిత ఫైలును శ్రీధర్‌బాబు తనవద్ద అట్టిపెట్టుకున్న విషయం విదితమే. అలాగే.. సీఎం అభిమతానికి భిన్నంగా.. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013కు మద్దతు తెలుపుతూ దీనిపై చర్చను ప్రారంభిస్తున్నట్లు శ్రీధర్‌బాబు డిసెంబర్ 16న శాసనసభలో ప్రకటించారు. ఈ పరిణామాన్ని సీఎం సహా సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు జీర్ణించుకోలేకపోయారు.

 

 ఆ మరుసటి రోజు సీఎం మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనలను పరిశీలిస్తే సభలో విభజన బిల్లును ఇంతవరకు ప్రవేశపెట్టలేదని వివరణ ఇచ్చారు. అయితే శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క సీఎం వ్యాఖ్యలను కొట్టిపారేశారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో విభజన బిల్లును ప్రవేశపెట్టారని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సమైక్యవాదుల దృష్టిలో పలుచన అయ్యాననే భావనతో ఉన్న సీఎం.. మరో రెండు రోజుల్లో శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభం కాబోతున్న తరుణంలో శ్రీధర్‌బాబును శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి తప్పించటం చర్చనీయాంశమైంది.


 


శ్రీధర్‌బాబు తన మాట విననందుకే ఆయనను శాసనసభ వ్యవహారాల బాధ్యతల నుంచి తప్పించి, తనకు సన్నిహితుడు, సమైక్యవాదం వినిపిస్తున్న శైలజానాథ్‌కు ఆ శాఖను కిరణ్ కట్టబెట్టినట్లు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. తద్వారా సభలో త నదే పైచేయి సాధించేలా వ్యూహం రూపొందించారని అభిప్రాయపడుతున్నారు. ఈ మార్పు వల్ల ఒకవేళ దీనిపై తెలంగాణవాదులు రాద్ధాంతం చేసి సభ జరగకుండా చేస్తే పరోక్షంగా తమకే లాభం జరుగుతుందని వారు చెప్తున్నారు. తెలంగాణవాదుల గొడవ వల్ల సభను జరపలేకపోయామని రాష్ట్రపతికి లేఖ రాస్తూ విభజనపై అసెంబ్లీ అభిప్రాయం తెలిపేందుకు మరో పక్షం రోజుల గడువు కోరతామని పేర్కొన్నారు.

 

 అంతా వ్యూహం ప్రకారమేనా..?: కొత్త సంవత్సరం ఆరంభంలో సీఎం చర్యలు కొంత విస్మయానికి గురిచేసినప్పటికీ.. కాంగ్రెస్ తెలంగాణ నేతలు మాత్రం ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటున్నారు. సీఎం ఏం చేసినా దానివల్ల తెలంగాణ వాదానికి జరిగే నష్టమేమీ లేదని, పెపైచ్చు శాసనసభ వ్యవహారాలవల్ల ఒరిగేది కూడా ఏమీ లేదని అభిప్రాయపడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా శ్రీధర్‌బాబుకు వాణిజ్య పన్నుల శాఖను ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర బడ్జెట్‌లో అత్యధిక ఆదాయం వాణిజ్య పన్నుల శాఖదే. ఏటా రూ. 40 వేల కోట్ల పైచిలుకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న కీలకమైన వాణిజ్య పన్నుల శాఖను కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటి వరకు ఎవరికీ కట్టబెట్టలేదు. అంతటి ముఖ్యమైన శాఖను శ్రీధర్‌బాబుకు అప్పగించడం పట్ల సీమాంధ్ర నేతలతో పాటు తెలంగాణ మంత్రులూ విస్మయం చెందుతున్నారు. శ్రీధర్‌బాబు తీరుపై సీఎంకు నిజంగా కోపముంటే ఇంతటి కీలకమైన శాఖను కట్టబెట్టి పదోన్నతి ఎందుకు కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు.

 

 ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరిగిందని, దీనిపై తాము పెద్దగా స్పందించదలచుకోలేదని తెలంగాణ సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలావుంటే.. శ్రీధర్‌బాబు శాఖ మార్పుకు నిరసనగా కరీంనగర్‌లో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం కిరణ్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు.


 


ఈ మార్పులపై ఆందోళన అక్కర్లేదు: కేసీఆర్

 రాష్ట్ర మంత్రివర్గ మార్పులపై తెలంగాణవాదులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న తరుణంలో ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడ్డారు. కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కేవలం భారత పార్లమెంటుకు ఉన్న సార్వభౌమాధికారమే తప్ప మరెవరికీ లేదని పేర్కొన్నారు. అనవసరమైన ఆందోళనలకు, ఆవేశాలకు ఎవరూ లోనుకావద్దని విజ్ఞప్తి చేసిన కేసీఆర్.. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

 




 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top