రైతులపై సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

రైతులపై మంత్రి సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Published Mon, Aug 20 2018 1:18 PM

Somireddy Controversial Comments on Farmers in Kurnool  - Sakshi

కర్నూలు : కర్నూలులో మంత్రి సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జెడ్పి మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ గ్రీవెన్స్ సెల్‌లో సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను పారిశ్రామికవేత్తలతో పోల్చారు. కేవలం లక్ష రూపాయలు అప్పు ఉన్న రైతులు ఆత్మహత్యలు ఎందు చేసుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్తలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు అంటూ, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను చులకనగా చేసి మాట్లాడారు. రైతులకు ఆదర్శవంతంగా రుణమాఫీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. రూ. 680 కోట్లతో రైతులకు కొంత రుణమాఫీ చేశామన్నారు. రుణమాఫీలో 9లక్షల ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. వాటిని పరిష్కరించి, అర్హులైన అందరు రైతులకు రుణమాఫీ అందజేస్తామని తెలిపారు. 


కాగా, సోమిరెడ్డికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి షాకిచ్చారు. జిల్లాలోని రైతాంగ సమస్యలను మంత్రి వద్ద ఎకరువు పెట్టారు. జిల్లాలో కరువు మండలాల గుర్తింపుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో 53 మండలాలకు గాను కేవలం 37 మండలాలను కరువు మండలాలుగా ఎంపిక చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. వర్షపాతం లేని కారణంగా కర్నూలు జిల్లాను కరువు పీడిత జిల్లాగా ఎంపిక చేయాలన్నారు. తమ ప్రాంతంలో వర్ష పాతం తక్కువగా ఉన్నా తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నకిలీ విత్తనాల బెడద అధికంగా ఉందని కేఈ పేర్కొన్నారు.

Advertisement
Advertisement