'పోలీసులను పంపాల్సిన అవసరం లేదు' | Shilpa Chandra Kishore Reddy Comments | Sakshi
Sakshi News home page

'పోలీసులను పంపాల్సిన అవసరం లేదు'

Published Tue, Aug 22 2017 8:23 PM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM

'పోలీసులను పంపాల్సిన అవసరం లేదు' - Sakshi

'పోలీసులను పంపాల్సిన అవసరం లేదు'

టీడీపీ నాయకులు అధికార బలంతో నంద్యాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి తనయుడు రవిచంద్ర కిశోర్‌ రెడ్డి ఆరోపించారు.

సాక్షి, నంద్యాల: టీడీపీ నాయకులు అధికార బలంతో నంద్యాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి తనయుడు రవిచంద్ర కిశోర్‌ రెడ్డి ఆరోపించారు. మంగళవారం రాత్రి పోలీసులు తమ నివాసంలో సోదాలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. పోలీసులను తమ ఇంటికి పంపాల్సిన అవసరం లేదని, తాము ఎటువంటి అక్రమాలకు పాల్పడటం లేదని చెప్పారు. తాము భయపడే రకం కాదని, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగబోమని స్పష్టం చేశారు. నంద్యాల ప్రజలు భయపడాల్సిన పనిలేదని భరోసాయిచ్చారు. అధికార పార్టీ ఒత్తిడితో  పోలీసులు పనిచేస్తున్నట్టు కనబడుతోందన్నారు.

ఈరోజు ఉదయం నుంచి తమ సేవా సంస్థలను పోలీసులు టార్గెట్‌ చేశారని, మూడు నాలుగుసార్లు వచ్చి మూసివేయాలని ఒత్తిడి తెచ్చారని తెలిపారు. పోలీసులు ఒత్తిడికి తాము లొంగలేదని, తాము ఉల్లంఘనకు పాల్పడితే చర్య తీసుకోమని చెప్పామన్నారు. నంద్యాల ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని, రేపటి ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెబుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

నంద్యాలలో యథేచ్ఛగా ఉల్లంఘనకు పాల్పడుతున్న టీడీపీ నాయకులను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మంత్రులు ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, సోమిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు ఇక్కడున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ ఫరూఖ్‌.. డబ్బులు, చీరలు, ముక్కుపుడకలు పంచినా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని వాపోయారు.

రాజకీయాల కోసం ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడేందుకు అధికార పక్షం వెనుకాడటం లేదని, టీడీపీ అరాచకాలపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రేపు పోలింగ్‌ ఉంది కాబట్టి ఏజెంట్లకు తమ ఇంటి దగ్గర సంబంధిత పత్రాలు అందజేస్తున్నామని, తామేమి జనసమీకరణ చేయడం లేదని వివరణయిచ్చారు. ఓడిపోతామనే భయంతో తమపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు కనబడుతోందన్నారు. నంద్యాలలో తప్ప దేశంలో ఎక్కడా ఈ పరిస్థితి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగబోమని రవిచంద్ర కిశోర్‌ రెడ్డి పునరుద్ఘాటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement