నేటి నుంచి భక్తులకు నేరుగా సర్వదర్శనం

Sarva Darshan To Devotees Directly from 17-03-2020 In TTD - Sakshi

టైంస్లాట్‌ విధానంలో అనుమతి  

తిరుమల: తిరుమలలో మంగళవారం తెల్లవారుజామున 12 గంటల నుంచి టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేయడం ద్వారా భక్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌–1, 2లలో వేచి ఉండకుండా టైంస్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. భక్తుల సౌకర్యార్థం తిరుమల, తిరుపతిలలో టైమ్‌ స్లాట్లు టోకెన్లు ఇవ్వడానికి కౌంటర్లు ఏర్పాటు చేశారు. టోకెన్లు తీసుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్, ఓటర్‌ కార్డు వంటి ఏదేని గుర్తింపు కార్డు తీసుకురావాలి. 

తిరుమలలో టోకెన్ల జారీ కేంద్రాలు: సీఆర్‌వో వద్ద –7 కౌంటర్లు, ఆర్‌టీసీ బస్టాండులో – 7 కౌంటర్లు ఏర్పాటు చేశారు.   
తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రాలు: విష్ణునివాసం, శ్రీనివాసం, రైల్వేస్టేషన్‌ వెనుకవైపు ఉన్న గోవిందరాజస్వామి 2, 3 సత్రాలు, ఆర్టీసీ బస్టాండ్, అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్లు జారీ చేస్తారు. అలిపిరి నడక మార్గంలోని నామాల గాలి గోపురం వద్ద, శ్రీవారి మెట్టు నడక దారిలో భక్తులు టోకెన్లు పొందవచ్చు.
తిరుమలలో 24న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం:  తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 24న టీటీడీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనుంది. ఏడాదిలో నాలుగుసార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితి. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందువచ్చే మంగళవారం ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 24వ తేదీ ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం సుమారు 5 గంటల పాటు కొనసాగనుంది. తిరుమంజనం కారణంగా మంగళవారం నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top