ఇసుక అక్రమ రవాణా అడ్డగింత

Sand mafia in Krishna - Sakshi

కృష్ణానదిలో పొక్లయిన్‌ను పట్టుకున్న వీఆర్వో

పరారైన అక్రమార్కులు

యనమలకుదురు ర్యాంప్‌లో ఘటన

కృష్ణాజిల్లా ,పెనమలూరు : రెవెన్యూ, పోలీసులు నిద్రావస్థలో ఉండటంతో యనమలకుదురు, పటమటలంక సరిహద్దుల్లో ఇసుక అక్రమ రవాణాను యనమలకుదురు గ్రామస్తులు గురువారం అడ్డుకున్నారు. ఒక పొక్లయిన్‌ను పట్టుకుని అధికారులకు అప్పగిం చగా, కృష్ణానదిలో ఉన్న లారీలు, ఇసుక మాఫియా సభ్యులు పారిపోయారు. వివరాలిలా ఉన్నాయి. మాఫియా చెలరేగిపోయి యనమలకుదురు ర్యాంప్‌ నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ అక్రమ ఇసుక రవాణాపై ఈనెల 16న ‘పడగవిప్పిన ఇసుక మాఫియా’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో యనమలకుదురు గ్రామ పంచాయతీ అధికారులు స్పందించారు. యనమలకుదురు ఇసుక ర్యాంప్‌ వద్ద గేటుకు తాళాలు వేశారు. అయితే ఇసుక మాఫియా గేటు తాళాలు పగులకొట్టి జేసీబీ, ఇసుక లారీలు, ట్రాక్టర్లతో కృష్ణానదిలోకి వెళ్లి మరలా అక్రమ ఇసుక తవ్వకాలు మొదలు పెట్టారు. ఈ విషయమై అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చినా ఎవ్వరూ స్పందించలేదు. దీంతో గురువారం గ్రామస్తులు ఆగ్రహంతో కృష్ణానదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఇసుక తవ్వకాలు జేస్తున్న జేసీబీని పట్టుకున్నారు. అయితే, ఆ ప్రాంతంలో ఉన్న లారీలు, ట్రాక్టర్లతో అప్పటికే ఇసుక మాఫియా పరార్‌ అయ్యింది. రెవెన్యూ, పోలీసులకు సమాచారం ఇవ్వటంతో యనమలకుదురు వీఆర్వో లక్ష్మి, పెనమలూరు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు.

పటమట స్టేషన్‌కు పొక్లయిన్‌ తరలింపు..
కాగా ఇసుక రవాణా యనమలకుదురు ర్యాంప్‌ నుంచి జరుగుతున్నా తవ్వకాలు పటమటలంక ప్రాంతంలో కావడంతో పటమట పోలీసులు జేసీబీని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అయితే ఇసుక తవ్వకాల వెనుక ఉంది యనమలకుదురు మాఫియా అని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ తవ్వకాలపై పటమట పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారని గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. కాగా నదిలో భారీ ఇసుక డంప్‌ కూడా ఉంది. దీనిని కూడా అర్భన్‌ రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది.

పోలీసులు ఏం చేస్తున్నారు. .?
యనమలకుదురు ఇసుక మాఫియా చెలరేగిపోతున్నా పెనమలూరు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గతంలో పెనమలూరు పీఎస్‌లో ఇసుక మాఫియాపై షీట్లు తెరిచారు. అయితే మాఫియా కదలికలను పోలీసులు పట్టించుకోకపోవటంతో వారు చెలరేగిపోతున్నారు. ఇసుక మాఫియాను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి బైండోవర్‌ కేసులు నమోదు చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top