సమైక్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రవేశించనుంది.
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రవేశించనుంది. ఆయన సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో ఉదయం 10 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు, సాయంత్రం 6 గంటలకు గూడూరు నియోజకవర్గ కేంద్రంలో జరిగే సభల్లో పాల్గొంటారు. ఫిబ్రవరి 1న ఉదయం వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోనూ, సాయంత్రం 5 గంటలకు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలోనూ జరిగే సభల్లో ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 2న ఆయన ఇడుపులపాయలో జరిగే రెండో ప్రజాప్రస్థానం(ప్లీనరీ)కుహాజరవుతారని పార్టీ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
చిత్తూరులో 26 రోజులపాటు యాత్ర: చిత్తూరు జిల్లాలో 26 రోజుల పాటు సాగిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర గురువారంతో ముగిసింది.
జిల్లాలో 2013 నవంబర్ 30న ప్రారంభమైన ఈ యాత్ర నాలుగు విడతలుగా సాగింది. మొత్తం 26 రోజుల పాటు 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్ పర్యటించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన 24 మందికి చెందిన కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. తిరుపతి నియోజకవర్గంలో రెండు కుటుంబాలను ఓదార్చాల్సి ఉన్నప్పటికీ అక్కడి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఉండటంతో ప్రస్తుతానికి మినహాయించారు. త్వరలో అక్కడ కూడా పర్యటిస్తారని రఘురామ్ తెలిపారు.


