ఉప్పు రైతుకు కరోనా దెబ్బ

Salt Farmers Loss With Lockdown And Corona Effect West Godavari - Sakshi

తీర ప్రాంతంలో ఆలస్యంగా సాగు

రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు

రెండు నెలలుగా విరామం

లాక్‌డౌన్‌ సడలింపుతో తాజాగా సాగుకు సిద్ధమైన రైతులు

నరసాపురం: వేసవి సీజన్‌ మొదలవగానే జిల్లాలోని నరసాపురం, మొగల్తూరు తీరప్రాంతంలో ఉప్పు మడులు కళకళలాడతాయి. అయితే ఈసారి కరోనా ఎఫెక్ట్‌ ఉప్పు రైతుకు కష్టాల్ని మిగిల్చింది. ఈ పాటికే సాగు ముమ్మరంగా సాగాల్సి ఉండగా.. లాక్‌డౌన్‌ కారణంగా ఆలస్యమైంది. ఆంక్షలు సడలించడంతో రైతులు ప్రస్తుతం ఉప్పుమడులు సిద్ధం చేస్తున్నారు. కొంతకాలంగా నష్టాల్లో సాగుతున్న ఉప్పు పరిశ్రమ ఏటికేడు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్‌తో సాగు మరింత తగ్గింది. పూర్తిగా వాతావరణంపై ఆధారపడి జరిగే ఉప్పు సాగు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే లాభాలు పండిస్తుంది. నరసాపురం ప్రాంతంలో 19 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి ఉంది. దీంతో తీర  గ్రామాల్లోని అనేక మంది ఉప్పు సాగు చేస్తుంటారు. తీరగ్రామాలైన నరసాపురం మండలంలోని పెదమైన వానిలంక, తూర్పుతాళ్లు, వేములదీవి, చినమైనవాని లంక, మొగల్తూరు మండలంలోని కేపీపాలెం, పేరుపాలెంలో ఉప్పుపంట సాగు ఎక్కువగా జరుగుతుంది. సుమారు 2 వేల కుటుంబాలు ఉప్పు పంటనే జీవనాధారం చేసుకుని జీవిస్తున్నారు. వీరంతా మత్స్యకారులే.

పెట్టుబడి రాని పరిస్థితి
స్థానికంగా పండించిన ఉప్పును మంచి ధర వచ్చే వరకూ భద్రపరుచుకునేందుకు గిడ్డంగులు.. ఇతర సదుపాయాలు గానీ లేవు. దీంతో పండించిన ఉప్పును ఆరుబయటే ఉంచడంతో వర్షాలు పడితే ఉప్పురాశులు కరిగిపోతున్నాయి. దీంతో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. దీంతో వర్షాకాలం, తుపానుల సమయంలోను సాగుకు విరామం ఇస్తారు. శీతాకాలంలో పెద్దగా సాగు జరగదు. ఎండాకాలం దిగుబడి ఎక్కువగా ఉండటంతో ముమ్మరంగా సాగు చేస్తారు. మార్చిలో ప్రారంభించి.. ఏప్రిల్‌లో తయారీ ముమ్మరం చేస్తారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రైతులు పూర్తిగా నష్టపోయారు. 

ఎండలో ఎంత శ్రమించినా..
ఉప్పు సాగు కష్టంతో కూడుకున్నది. మండే ఎండలో శ్రమించాలి. చిన్న చిన్న మడులు ఏర్పాటు చేసి ఉప్పు సాగు చేస్తారు. ఒక్కో ఎకరంలో 60 నుంచి 70 మడులు కడతారు. ముందుగా మడుల్లో మట్టిని కాళ్లతో తొక్కి చదును చేసి తరువాత సముద్రంలోని ఉప్పు నీటిని నింపుతారు. సాగు ప్రారంభమైన నాటి నుంచి మడుల్లో 60 రోజుల పాటు 6 నుంచి 10 మంది శ్రమిస్తేనే కానీ ఉప్పు తయారు కాదు.  ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతుంది. రైతుకు మాత్రం అమ్మేటప్పుడు గిట్టుబాటు కాక నష్టపోతున్నారు. 

రొయ్యల చెరువులుగా ఉప్పుమడులు
తీరంలో ఉప్పుసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. మడులను రొయ్యల చెరువులుగా మార్చేశారు. ఒకప్పుడు మొగల్తూరు మండలంలో కేపీపాలెం, పేరుపాలెం గ్రామాల్లోనే 2 వేల ఎకరాల్లో ఉప్పుసాగు చేసేవారు. ప్రస్తుతం మొగల్తూరు మండలంలో కేవలం 40 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. నరసాపురం మండలంలో 1500 ఎకరాల్లో సాగు జరుగుతుంది. స్థానికంగా ఉప్పుసాగుకు ఊతమిచ్చి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉప్పు తయారయ్యేలా చర్యలు చేపడతామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదు.

కరోనా వల్ల ఆలస్యమైంది
కరోనా కారణంగా ఈ ఏడాది ఉప్పుసాగు ఆలస్యమైంది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఖాళీగా ఉన్నాం. దీనివల్ల సగం సీజన్‌ నష్టం పోయాం. ఇప్పటి నుంచైనా సాగు సజావుగా సాగాలి. ఎండలు ఎక్కువగా ఉంటే పంట ఎక్కువగా పండుతుంది. తుపానులు వస్తే మళ్లీ ఇబ్బంది.  సవరం శ్రీకృష్ణ , తూర్పుతాళ్లు, ఉప్పురైతు

చెరువులుగా మారిపోతున్నాయి
మా ప్రాంతంలో ఉప్పుసాగు దాదాపుగా మానేశారు. వనామీ రొయ్యల సాగు బాగుంది. దీంతో ఉప్పు మడులన్ని రొయ్యల చెరువులుగా మారిపోతున్నాయి. ఎక్కువ లీజుకు ఇచ్చి భూములు తీసుకుంటున్నారు. ఉప్పు పంటలో ఎంత కష్టపడ్డా డబ్బులు రావడంలేదు. దీంతో ఉప్పుసాగుపై ఆశక్తి ఉండటంలేదు.  కడలి గణపతి, తూర్పుతాళ్లు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top