
ఆదుకుంటాడనుకుంటే...
ఈ ఏడాదితో బీటెక్‌చదువు పూర్తవు తుంది... కుటుంబానికి అండగా నిలుస్తాడని భావిస్తే కొడుకు శవంగా మారి ఇంటికి ...
మునగపాక: ఈ ఏడాదితో బీటెక్‌చదువు పూర్తవు తుంది... కుటుంబానికి అండగా నిలుస్తాడని భావిస్తే కొడుకు శవంగా మారి ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం జగన్నాథపురం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని వాడ్రాపల్లికి చెందిన కాకి రమణబాబు, కనకమహాలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణ(నాని) మృతి చెందాడు. ఇతను విశాఖలోని నరవలో ఉన్న విశాఖ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఆ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
మృతదేహాలకు బొబ్బిలి ఆస్పత్రిలో పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించి, గురువారం సాయంత్రం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. లక్ష్మీనారాయణ మృతదేహానికి వాడ్రాపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు గ్రామస్తులు, ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కుమారుడు మృతి చెందడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. విధి తమతో ఆడుకుందని, ఒక వైపు ఆటో నడుపుతూ, మరో వైపు చేపలవేట సాగిస్తూ కష్టపడి కొడుకుని చదివించానని లక్ష్మీనారాయణ తండ్రి రమణబాబు బోరున విలపిస్తూ తెలిపాడు. పెళ్లికి వెళ్లిన కొడుకు చివరిగా నాన్నా నా అకౌంట్‌లో రూ.10 వేలు వేయమని కోరాడని ఇంకా వేయకుండా కానరాని లోకాలకు వెళ్లిపోయాడని లక్ష్మీనారాయణ తండ్రి బోరున విలపించాడు.