ఈసారి ‘పంట’ పండింది

Rice yield in Kharif  is above 78 lakh tonnes - Sakshi

ఖరీఫ్‌లో 78.68 లక్షల టన్నుల వరి దిగుబడి 

కంది, మినుము, వేరుశనగ, పత్తి, మిర్చిలోనూ పెరుగుదల 

అన్నదాతలకు కలిసొచ్చిన సర్కారు సంక్షేమ పథకాలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈసారి ‘పంట’ పండింది. అన్ని రకాల పంటలకూ అంచనాలకు మించి దిగుబడులు వచ్చాయి. ప్రస్తుత ఖరీఫ్‌ (2019–20) సీజన్‌లో అన్నదాతలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలు ఒకరకంగా ఉపకరిస్తే.. పుష్కలంగా వర్షాలు కురవడం.. సాగు విస్తీర్ణం పెరగడం కూడా దిగుబడులు గణనీయంగా పెరగడానికి కారణమయ్యాయి. ఆర్థిక గణాంక శాఖ రెండో ముందస్తు అంచనా ప్రకారం రాష్ట్రంలో వరి ఉత్పత్తి సుమారు 78.68 లక్షల టన్నులుగా ఉండొచ్చని అంచనా వేసింది. మొదటి అంచనా కన్నా ఇది ఎక్కువ. మిగతా పంటల దిగుబడులు కూడా గతంతో పోలిస్తే పెరిగాయి. రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంటలుగా ఉన్న మిర్చి, పత్తి, వేరుశనగ, కంది దిగుబడులు కూడా చెప్పుకోదగిన రీతిలో పెరిగాయి.  

గణనీయంగా పెరిగిన దిగుబడులు.. 
ఏపీలోని ప్రధాన పంటల దిగుబడులన్నీ పెరిగాయి. గతంలో హెక్టార్‌కు 5,029 కిలోలుగా ఉన్న వరి ఈ ఖరీఫ్‌లో 5,166 కిలోలకు చేరింది. జొన్న, సజ్జ, చిరు ధాన్యాల దిగుబడి హెక్టార్‌కు రెండు మూడింతలు పెరిగాయి. 2018–19లో హెక్టార్‌కు 130 కిలోలుగా ఉన్న జొన్న 1,036 కిలోలకు.. సజ్జ 1,013 నుంచి 2,322 కిలోలకు చేరింది. మిర్చి, పత్తి, వేరుశనగ, కంది సాగులోనూ పెరుగుదల ఉంది. మిర్చి హెక్టార్‌కు గతేడాది ఖరీఫ్‌లో 3,142 కిలోలుగా ఉంటే ఈ ఏడాది అది 4,615 కిలోలుగా, పత్తి హెక్టార్‌కు 1,224 నుంచి 1,713 కిలోలకు చేరింది. వేరుశనగ దిగుబడి హెక్టార్‌కు 484 నుంచి 1,035 కిలోలకు.. కంది 180 నుంచి 831 కిలోలకు చేరింది.

ఫలితాన్నిచ్చిన రైతు సంక్షేమ పథకాలు 
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా, ఉచిత పంటల బీమా వంటి సంక్షేమ పథకాలతోపాటు సమృద్ధిగా కురిసిన వర్షాలు ఈ ఏడాది ఖరీఫ్‌లో ఉత్పత్తులు పెరగడానికి దోహదపడ్డాయని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఖరీఫ్‌ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైనా ఆ తర్వాత కురిసిన వర్షాలు పంటలకు కలిసి వచ్చాయి. అలాగే, రిజర్వాయర్లు నిండడంతో నీటి సమస్య లేకుండాపోయింది. చీడపీడల బెడద కూడా ఈ ఏడాది తక్కువగా ఉంది. ఒక్క పత్తికి మాత్రమే కొన్ని ప్రాంతాలలో తెగుళ్లు సోకినట్టు గుర్తించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టారు. వైఎస్సార్‌ రైతు భరోసా కింద ప్రస్తుత రబీ సీజన్‌ నుంచి ఇచ్చిన పెట్టుబడి సాయం రైతులకు ఎంతగానో ఉపకరించినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top