చంటి బిడ్డలకు ‘ఆర్‌ఎఫ్‌ఐడీ’ రక్ష

RFID Tag For Birth Childs And Mothers In Guntur - Sakshi

చంటి బిడ్డల అపహరణకు చెక్‌

జిల్లా వైద్యశాలలో కొత్త విధానం

ప్రారంభానికి సిద్ధంగా ‘ఆర్‌ఎఫ్‌ఐడీ’   

తెనాలిఅర్బన్‌: ఆస్పత్రుల్లో చంటిబిడ్డల అపహరణలకు చెక్‌ పెట్టేందుకు తెనాలి జిల్లా వైద్యశాల సిద్ధమవుతోంది. అందుకు అవసరమైన ఆర్‌ఎఫ్‌ఐడీ విధానాన్ని వైద్యశాలలో ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో తల్లి–బిడ్డకు ట్యాగ్‌లను వేయనున్నారు. అలాగే ప్రసూతి విభాగంలో సిస్టమ్స్‌కు సంబంధించి సెన్సార్‌ను కూడా ఏర్పాటు చేశారు.

పెరిగిన రద్దీ..
తెనాలి జిల్లా వైద్యశాలలో 150 పడకల తల్లి–పిల్లల వైద్యశాలో నెలకు సుమారు 300 ప్రసవాలు జరుగుతున్నాయి. దీనివల్ల జిల్లా వైద్యశాల ఆవరణ నిత్యం రద్దీగా ఉంటుంది. గతంలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో పసిబిడ్డల అపహరణలు జరగటం.. తెనాలి జిల్లా వైద్యశాలలో అప్పుడే పుట్టిన చిన్నారులను వదిలి వెళ్లటం వంటి ఘటనలు జరిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని చిన్నారుల అపహరణలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో జిల్లా వైద్యశాల ఒక అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ డివైజ్‌(ఆర్‌ఎఫ్‌ఐడీ) విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వార్డుల్లో ఇప్పటికే సెన్సార్‌లను ఏర్పాటు చేశారు. అలాగే సిస్టం అమలుకు అవసరమైన గదిని కూడా కేటాయించారు. రెండు రోజుల్లో దీనిని అధికారికంగా జిల్లా వైద్యశాలలో ప్రవేశపెట్టనున్నారు.

ఆర్‌ఎఫ్‌ఐడీ పనిచేసే విధానం..
జిల్లా వైద్యశాలలో కాన్పు జరిగిన వెంటనే తల్లి–పుట్టిన చంటి బిడ్డకు ఒకే నంబర్‌ కలిగిన ట్యాగ్‌లను చేతులకు వేస్తారు. ట్యాగ్‌లు వేసిన వారిని బయటకు తీసుకెళ్లేందుకు అనుమతించరు. ఎవరైన చంటి బిడ్డను అపహరించాలని చూసి  బయటకు తీసుకువెళ్లితే వార్డులో ఏర్పాటు చేసిన అలారాలు మోగుతాయి. అంతే కాకుండా చంటిబిడ్డ ఫొటో, వివరాలను ఆర్‌ఎఫ్‌ఐడీ మానిటర్స్‌ డిస్ప్లే చేస్తాయి. వాటిని నిత్యం పర్యవేక్షించే సిబ్బంది సెక్యూరిటీని అప్రమత్తం చేసి, దొంగను పట్టుకునే విధంగా చూస్తారు. మొత్తం మీద గుంటూరులో మినహా జిల్లాలో ఇలాంటి ఆర్‌ఎఫ్‌ఐడీ విధానాన్ని అమలు చేస్తున్న ఆస్పత్రిగా జిల్లా వైద్యశాల నిలవనుంది. ఇది విజయవంతం అయితే పిల్లల దొంగతనాలకు చెక్‌పెట్టినట్లే.

చిన్నారుల అపహరణకు చెక్‌..
ఆర్‌ఎఫ్‌ఐడీ విధానాన్ని జిల్లా వైద్యశాలలోని తల్లి–పిల్లల వైద్యశాలలో ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తల్లి–బిడ్డలకు ఒకే నంబర్‌ ట్యాగ్‌లు వేస్తాం. వాటికి ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సార్‌కు సంకేతాలు పంపి సిబ్బందిని అలర్ట్‌ చేస్తుంది. అలాగే ట్యాగ్‌లను పాడుచేసేందుకు  అవకాశం ఉండదు. దీని వల్ల చంటిబిడ్డల దొంగతనాలను నియంత్రించవచ్చు.
–డాక్టర్‌ ఎం సనత్‌కుమారి,సూపరింటెండెంట్, జిల్లా వైద్యశాల, తెనాలి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top