ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజన చేయనీయబోమని, అడ్డుకొని తీరుతామని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను చెప్పారు.
=పార్టీ పిలుపు మేరకు పంచాయతీల సమైక్య తీర్మానాలు
=వాటిని ప్రధాని, జీవోఎంలకు ఈమెయిల్ చేసిన ఉదయభాను
జగ్గయ్యపేట, న్యూస్‌లైన్ : ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజన చేయనీయబోమని, అడ్డుకొని తీరుతామని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను చెప్పారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్లు చేసిన తీర్మానాలను ఉదయభాను ప్రధాని మన్‌మోహన్‌సింగ్, గ్రూపు ఆఫ్ మినిస్టర్స్(జీవోఎం)కు ఈ మెయిల్ ద్వారా పంపే కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరుతూ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, వార్డుమెంబర్లు తీర్మానాలు చేశారు. స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహనీయుల ఆత్మబలిదానంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కొందరు స్వార్థపరశక్తుల కారణంగా విచ్ఛిన్నమయ్యే ముప్పు తలెత్తిందన్నారు. విభజన ప్రక్రియను చేపట్టిన కేంద్ర ప్రభుత్వం గత సంప్రదాయాలు, మార్గదర్శకాలు, ప్రాతిపదికలను అనుసరించాలన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టటం ద్వారా ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కుకు మరో నిదర్శనం
పంట నష్టపోయి దీనావస్థలో ఉన్న రైతన్నను పరామర్శించేందుకు తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను అక్రమంగా అరె స్ట్‌చేసిన కిరణ్ సర్కారు.. చంద్రబాబును అడ్డుకోకపోవటం వెనక ఆ రెండు పార్టీల కుమ్మక్కు మరోసారి బయటపడిందని ఉదయభాను విమర్శించారు. శుక్రవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో విజయమ్మ పర్యటనను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అదే ప్రాంతంలో చేస్తున్న పర్యటనను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర ఉద్యమం చేపట్టిన జగన్‌కు వస్తున్న జనాదరణ చూసి ఆ రెండు పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఆ రెండు పార్టీలకు త గిన సమయంలో బుద్ధిచెప్పేందుకు జనం ఉవ్విళ్లూరుతున్నారన్నారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తన్నీరు నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్ మదార్‌సాహెబ్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చింకా వీరాంజనేయులు, గూడపాటి శ్రీనివాస్, జనార్ధన్, జగదీష్, యూత్ నాయకులు రాంబాబు, నంబూరు రవి పాల్గొన్నారు.