
సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో: 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం ఘనంగా జరిగాయి. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె.మహేశ్వరి, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆకట్టుకునేలా కవాతు
వేడుకల్లో కవాతు ఆకట్టుకునేలా సాగింది. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, తెలంగాణ స్టేట్ పోలీసు, ఏపీఎస్పీ 6వ బెటాలియన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, ఎన్‌సీసీ క్యాడెట్లు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, యూత్ రెడ్ క్రాస్‌లు కవాతుతో అలరించాయి.
శకటాల ప్రదర్శన అదుర్స్
సాయుధ బలగాల వెనుక అగ్నిమాపక, వ్యవసాయ, గృహ నిర్మాణ, జల వనరుల, వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి, అబ్కారీ, విద్యా, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పశు సంవర్ధక, మత్స్య, అటవీ, నైపుణ్యాభివద్ధి–శిక్షణ, పర్యాటక, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల శకటాలు కవాతులో పాల్గొన్నాయి. ప్రభుత్వ పథకాలు అమలు తీరును శకటాల్లో చూపిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. మహిళల రక్షణలో దేశానికే దిశానిర్ధేశం చేసిన దిశ చట్టం గొప్పతనాన్ని వివరిస్తూ ప్రదర్శించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అవార్డుల ప్రదానం
కవాతులో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి గవర్నర్ అవార్డులు ప్రదానం చేశారు. సాయుధ బలగాల్లో ప్రథమ బహుమతి ఇండియన్ ఆర్మీ దక్కించుకోగా.. అన్ ఆర్మ్‌డ్ కంటింజెంట్ విభాగంలో ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రథమ బహుమతి దక్కించుకుంది. ద్వితీయ స్థానాల్లో వరుసగా తెలంగాణ స్టేట్ పోలీసు, ఎన్‌సీసీ క్యాడెట్(బాలికలు)లు నిలిచారు. శకటాల ప్రదర్శనలో ప్రథమ బహుమతి సమగ్రశిక్ష, పాఠశాల విద్యాశాఖకు, ద్వితీయ స్థానం మహిళాభివృద్ధి–శిశు సంక్షేమ శాఖ(దిశ చట్టంపై)కు, తృతీయ స్థానం వ్యవసాయశాఖకు దక్కాయి.