వ్యక్తిని బలిగొన్న పోలీసు జీపు | relatives strike in front of police station | Sakshi
Sakshi News home page

వ్యక్తిని బలిగొన్న పోలీసు జీపు

Jan 14 2014 2:30 AM | Updated on Aug 21 2018 9:00 PM

పోలీసు జీపు ఓ వ్యక్తిని బలిగొని ఓ కుటుంబాన్ని రోడ్డుపాల్జేసింది. పండుగపూట విషాదం చోటుచేసుకున్న ఈ సంఘటన మండలంలోని ఇబ్రహీంపల్లి సమీపంలోని జాజుగుట్ట వద్ద సోమవారం చోటుచేసుకుంది.

 చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: పోలీసు జీపు ఓ వ్యక్తిని బలిగొని ఓ కుటుంబాన్ని రోడ్డుపాల్జేసింది. పండుగపూట విషాదం చోటుచేసుకున్న ఈ సంఘటన మండలంలోని ఇబ్రహీంపల్లి సమీపంలోని జాజుగుట్ట వద్ద సోమవారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, స్థానికులు మృతదేహంతో ఠాణా ఎదుట ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాలు.. ఇబ్రహీంపల్లికి చెందిన బీరప్పొళ్ల కుమార్(26) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం ఆయన బైకుపై గ్రామ సమీపంలోని జాజుగుట్టకు వెళ్తున్నాడు. అదే సమయంలో చేవెళ్ల నుంచి పరిగి కోర్టుకు నిందితులను తీసుకెళ్తున్న పోలీసు జీపు అతివేగంగా వస్తూ అతడి బైకును ఢీకొంది. దీంతో కుమార్ రోడ్డుపై పడిపోయాడు.

ఆయన పొట్టపైనుంచి పోలీసు జీపు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు జీపును ఆపకుండా చేవెళ్ల ఠాణాకు వెళ్లారు. స్థానికుల సమాచారంతో 108 వాహనంలో చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ శ్రీధర్ ఆస్పత్రికి చేరుకొని పరిస్థితిని గమనించారు. ఆయన సూచన మేరకు కుమార్‌ను అంబులెన్స్‌లో నగరానికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. చేవెళ్ల ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన జీపును, డైవర్ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

 ఠాణా ఎదుట ఆందోళన..
 కుమార్ మృతితో గ్రామస్తులు, బంధువులు పెద్దఎత్తున చేవెళ్లకు చేరుకున్నారు. పోలీసుల నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ మృతదేహంతో ఠాణా ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు అప్రమత్తమై చేవెళ్ల సర్కిల్‌లోని సిబ్బందిని రప్పించారు. రెండుగంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని డీఎస్పీ శ్రీధర్  ఆందోళనకారులకు సర్దిచెప్పారు. అనంతరం మృతదేహాన్ని  చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు.

 తమకు స్పష్టమైన హామీ వచ్చేవరకు పోస్టుమార్టం నిర్వహించొద్దని ఆందోళనకారులు అక్కడ భీష్మించారు. దీంతో డీఎస్పీ శ్రీధర్ జిల్లా ఎస్పీ రాజకుమారితో ఫోన్‌లో మాట్లాడారు. బాధితుడి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సమస్య సద్దుమణిగింది. ఎస్పీ ఆదేశాల మేరకు చేవెళ్ల ఎస్‌ఐ లక్ష్మీరెడ్డి అంత్యక్రియల కోసం రూ. 10 వేలు అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement