బేరానికి బెజవాడ రైల్వే స్టేషన్‌

railways palnning to lease vijayawada railway station to pravate organizations - Sakshi

రీ డెవలప్‌మెంట్‌కు రైల్వేశాఖ నిర్ణయం

45 ఏళ్ల లీజుకు గత ఏడాది స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో టెండర్లు  

99 ఏళ్ల పాటు లీజు గడువు పెంచాలన్న బిడ్డర్లు

లీజు ప్రతిపాదనలు సవరించాలని రైల్వే బోర్డుకు నివేదిక

లీజు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు  

సాక్షి, అమరావతి : బెజవాడ రైల్వే స్టేషన్‌ బేరానికి ప్రైవేటు కంపెనీలు ‘టెండర్‌’ పెట్టాయి. లీజు గడువు 45 ఏళ్లు కాదు.. 99 ఏళ్లకు పొడిగిస్తేనే టెండర్లలో పాల్గొంటామని దక్షిణ మధ్య రైల్వేకు తేల్చి చెప్పాయి. దీంతో ప్రైవేటు కంపెనీల డిమాండ్‌ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు తాజాగా నివేదిక పంపించారు. ఇది రైల్వేస్టేషన్లను ప్రైవేటుకు కట్టబెట్టడమేనని రైల్వే యూనియన్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌కు పరిసరాలు, ఫ్లాట్‌ ఫాంలు అన్నీ కలిపి దాదాపు 22 ఎకరాలకు పైగా స్థలం ఉంది. రూ.195 కోట్లు విలువగా బెజవాడ స్టేషన్‌ను నిర్ధారించి, ఇందులో ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రైవేటు కంపెనీలకు 45 ఏళ్ల పాటు లీజుకు అప్పగించాలని గత ఏడాది ప్రతిపాదించింది. 99 ఏళ్ల పాటు లీజుకు అయితే టెండర్లలో పాల్గొంటామని కంపెనీలు స్పష్టం చేశాయి.

45 ఏళ్లపాటు లీజుకు టెండర్లు
రైల్వేల్లో ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానించేందుకు గాను రైల్వే మంత్రిత్వ శాఖ గతేడాది ప్రారంభంలో స్టేషన్‌ రీ డెవలప్‌మెంట్‌ (ఎస్‌ఆర్‌పీ) కార్యక్రమాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్లను ప్రైవేటుకు అప్పగించడం ద్వారా నాన్‌ టిక్కెట్‌ రెవెన్యూ కింద రూ.లక్ష కోట్లు ఆర్జించేందుకు ప్రణాళికలు రూపొందించారు. దేశం మొత్తంలో 23 స్టేషన్లు ఎంపిక చేసిన రైల్వే శాఖ.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్లు రీ డెవలప్‌మెంట్‌ కింద ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్‌లో కమర్షియల్‌ స్థలంతో పాటు రైల్వేకు చెందిన ఖాళీ స్థలాలను 45 ఏళ్ల పాటు ప్రైవేటుకు లీజుకు అప్పగిస్తారు. వీటిలో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించేలా ప్రైవేటు కంపెనీలు నిర్మాణాలు చేపట్టాలి. రైల్వే స్టేషన్‌లోనే మల్టీప్లెక్స్‌ థియేటర్లు, హోటళ్లు, పార్కింగ్‌ ప్రదేశాలు, అధునాతన స్కానర్లు తదితరాలతో పాటు రైల్వే స్టేషన్‌ను ఓ ఐకానిక్‌ భవంతిలా తీర్చిదిద్దాలి. గతేడాది స్విస్‌ ఛాలెంజ్‌లో విజయవాడ రైల్వే స్టేషన్‌ను ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు టెండర్లు పిలిచారు. ప్రైవేటు కంపెనీలకు అప్పగించినందుకు గాను రైల్వేకు 45 ఏళ్ల పాటు లీజు విధానంలో మొత్తం రూ.195 కోట్లు చెల్లించాలి. లీజు గడువు ముగిసిన తర్వాత అభివృద్ధి చేసిన స్టేషన్‌ను తిరిగి రైల్వేకు అప్పగించాలి.

99 ఏళ్ల లీజు కావాలంటున్న కంపెనీలు
విజయవాడ రైల్వే స్టేషన్‌ను రీ డెవలప్‌మెంట్‌ చేసేందుకు గాను గత ఏడాది స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. అయితే ఈ టెండర్లలో పాల్గొనేందుకు ప్రైవేటు కంపెనీలు ముందుకు రాలేదు. 45 ఏళ్ల పాటు లీజుకు కుదరదని, 99 ఏళ్ల పాటు లీజుకు అయితే టెండర్లలో పాల్గొంటామని ప్రీ బిడ్డింగ్‌ సమావేశంలో స్పష్టం చేశాయి. ఇదే విషయాన్ని విజయవాడ డివిజన్‌ రైల్వే ఉన్నతాధికారులు రైల్వే బోర్డుకు నివేదిక పంపించారు. రాష్ట్రంలోని ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు కంపెనీలు 33 ఏళ్ల పాటు లీజుకు అంగీకరించి బీవోటీ విధానంలో బస్టాండ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే స్థలాల అభివృద్ధి కోసం 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని కోరడం సమంజనం కాదని రైల్వే ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై రైల్వే బోర్డు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే. మరోవైపు చారిత్రాత్మక స్టేషన్‌గా, ఉత్తర, దక్షిణ భారతావనులను కలిపే జంక్షన్‌గా ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్‌ను ప్రైవేటుకు అప్పగించడాన్ని రైల్వే యూనియన్‌ నేతలు వ్యతిరేకిస్తున్నారు.

  • 1888 విజయవాడ రైల్వే స్టేషన్‌ నిర్మాణం జరిగిన సంవత్సరం
  • 250 విజయవాడ మీదుగా రోజు రాకపోకలు సాగించే రైళ్లు
  • రూ. 70 లక్షలు రోజుకు ఆదాయం
  • రోజుకు ప్రయాణికుల ట్రాఫిక్‌ లక్ష
  • భవనాల నిర్మాణ స్థలం: 3 ఎకరాలు
  • 7.87 ఎకరాలు విజయవాడ రైల్వే స్టేషన్‌ వద్ద రిజర్వ్‌ స్థలం
  • 8.81  ఎకరాలు ఫ్లాట్‌ ఫాంలు విస్తరించిన స్థలం
  • సర్కులేటింగ్‌ ఏరియా: 1.90 ఎకరాలు
  • ప్రైవేటుకు అప్పగించేందుకు రైల్వేశాఖ
  • నిర్ణయించిన వ్యయం: రూ. 195 కోట్లు
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top